Srilakshmi IAS: ‘లీజు కోసం లంచమడిగిన ఐఏఎస్‌ శ్రీలక్ష్మి’

మైనింగ్‌ లీజులు దక్కాలంటే లక్షలు ఖర్చవుతుందంటూ దరఖాస్తుదారులను ఉమ్మడి రాష్ట్రంలోని పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి, ప్రస్తుత ఏపీ ఐఏఎస్‌ అధికారి వై.శ్రీలక్ష్మి, గనుల శాఖ అప్పటి డైరెక్టర్‌ వి.డి.రాజగోపాల్‌

Updated : 30 Sep 2022 07:18 IST

రూ.80 లక్షలు డిమాండ్‌ చేశారని  సీబీఐ ఆరోపణ

ఈనాడు, హైదరాబాద్‌: మైనింగ్‌ లీజులు దక్కాలంటే లక్షలు ఖర్చవుతుందంటూ దరఖాస్తుదారులను ఉమ్మడి రాష్ట్రంలోని పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి, ప్రస్తుత ఏపీ ఐఏఎస్‌ అధికారి వై.శ్రీలక్ష్మి, గనుల శాఖ అప్పటి డైరెక్టర్‌ వి.డి.రాజగోపాల్‌ డిమాండ్‌ చేశారని సీబీఐ వెల్లడించింది. దరఖాస్తులను పరిశీలించడానికి రూ. 80 లక్షలు అడిగినట్లుగా లీజు పోటీదారులు వాంగ్మూలం ఇచ్చారన్నారు. ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నిందితులైన శ్రీలక్ష్మి, రాజగోపాల్‌, మాజీ ఐఏఎస్‌ కృపానందం, గనుల శాఖ అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్‌ అలీఖాన్‌ల డిశ్ఛార్జి పిటిషన్‌లపై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి సీహెచ్‌.రమేశ్‌బాబు బుధ, గురువారాల్లో విచారణ జరిపారు. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ తదితరులు గాలి జనార్దన్‌రెడ్డితో కుమ్మక్కయ్యారని చెప్పారు. ఇతరులు లీజు కోసం ప్రయత్నిస్తే లక్షలు ఖర్చుపెట్టగలరా అని అడిగారన్నారు. గాలికి లీజులు దక్కడంలో వీరు కీలక పాత్ర పోషించారని చెప్పారు. గాలి జనార్దన్‌రెడ్డి అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని పేర్కొన్నారు. సింగపూర్‌, చైనా లకు ఖనిజాన్ని తరలించారని సాక్షులు వాంగ్మూలం ఇచ్చారన్నారు. మాజీ ఐఏఎస్‌ కృపానందం ప్రాసిక్యూషన్‌కు ఎలాంటి అనుమతులు అవసరం లేదని, కేసు నమోదు చేసేనాటికే ఆయన పదవీ విరమణ చేశారన్నారు. దీనిపై తదుపరి విచారణ శుక్రవారం కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని