తల్లీకుమార్తెల ఆత్మహత్య

పార్కిన్‌సన్స్‌ వ్యాధితో బాధపడుతున్న కుమార్తెను ఆ తల్లి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. ఒకటికాదు రెండు కాదు 14 ఏళ్లుగా సేవలు చేశారు. ఇంతలో విధికి కన్నుకుట్టింది. రెండు నెలల కిందట తల్లి కూడా అదే వ్యాధి బారినపడ్డారు. మానసికంగా

Published : 30 Sep 2022 03:07 IST

పార్కిన్‌సన్స్‌ వ్యాధితో మానసిక కుంగుబాటే కారణం 

విజయవాడ (గొల్లపూడి), న్యూస్‌టుడే: పార్కిన్‌సన్స్‌ వ్యాధితో బాధపడుతున్న కుమార్తెను ఆ తల్లి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. ఒకటికాదు రెండు కాదు 14 ఏళ్లుగా సేవలు చేశారు. ఇంతలో విధికి కన్నుకుట్టింది. రెండు నెలల కిందట తల్లి కూడా అదే వ్యాధి బారినపడ్డారు. మానసికంగా కుంగుబాటుకు గురైన ఇద్దరూ అపార్ట్‌మెంటు పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ దయనీయ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

విజయవాడ గొల్లపూడిలోని అయ్యప్పస్వామి గుడి వీధిలో నివాసం ఉంటున్న బొప్పన సత్యవతి (60), చంద్రశేఖర్‌ దంపతులకు కుమార్తె మాధవి (40), కుమారుడు ఉన్నారు. మాధవికి 22 ఏళ్ల క్రితం కందుల పురుషోత్తంతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. మాధవి 14 ఏళ్లుగా పార్కిన్‌సన్స్‌ వ్యాధితో బాధపడుతున్నారు. అప్పుడప్పుడూ ఫిట్స్‌ వచ్చేవి. ఈ కారణంగా ఆమె భర్త, పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటున్నారు. మాధవిని తల్లి సత్యవతి కంటికి రెప్పలా చూసుకునేవారు. రెండు నెలల క్రితం సత్యవతి కూడా ఆ వ్యాధి బారినపడ్డారు. ఇద్దరూ కలిసి మందులు వాడుతున్నారు.

అమ్మవారిని దర్శించుకుని...:

వ్యాధితో వచ్చే ఇబ్బందులకు తట్టుకోలేక తమకు ఎన్నటికీ నయం కాదేమోననే నిస్పృహకు లోనైన తల్లీకుమార్తెలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఉదయం గొల్లపూడి కరకట్ట ప్రాంతంలోని అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అనంతరం ఆటోలో గొల్లపూడి వన్‌ సెంటర్‌ దగ్గర గతంలో అద్దెకున్న అపార్ట్‌మెంటుకు చేరుకున్నారు. ఇద్దరూ పైకి వెళ్లి కిందకు దూకారు. భారీ శబ్దం రావడంతో అపార్ట్‌మెంటు వాసులు పరుగున కిందికి వచ్చి చూడగా సత్యవతి, మాధవి తీవ్రగాయాలతో కనిపించారు. తలలకు, శరీర భాగాలకు బలమైన దెబ్బలు తగలడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. మృతుల కుటుంబసభ్యులు, పోలీసులకు అపార్ట్‌మెంటు వాసులు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పార్కిన్‌సన్స్‌ వ్యాధి కారణంగానే తన భార్య మాధవి, అత్త సత్యవతి మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడ్డారని పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని