వసూళ్ల బాగోతం ‘వెలుగు’లోకి..

వేతనాలు పెంచుతామని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలుచేస్తామని వెలుగు, వైకేపీలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందికి సంబంధిత మంత్రిత్వ శాఖ పరిధిలో ఓ అధికారి వసూళ్లకు తెరలేపినట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వెలుగులో పనిచేస్తున్న

Published : 30 Sep 2022 03:07 IST

 వేతనాలు పెంచుతామంటూ ఓ అధికారి అక్రమాలు

అకౌంటెంట్ల నుంచి వసూలు చేసిన డబ్బులు వెనక్కి..!

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి: వేతనాలు పెంచుతామని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలుచేస్తామని వెలుగు, వైకేపీలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందికి సంబంధిత మంత్రిత్వ శాఖ పరిధిలో ఓ అధికారి వసూళ్లకు తెరలేపినట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వెలుగులో పనిచేస్తున్న అకౌంటెంట్లు, ఎంఎస్‌సీసీలు (మండల సమాఖ్య క్లస్టర్‌ కోఆర్డినేటర్లు) పలువురి నుంచి రూ.20 వేల నుంచి రూ.36 వేల వరకు వసూలు చేశారు. జిల్లాలవారీగా ఆయా క్యాడర్ల సంఘాల ద్వారా ఈ తంతు నడిపారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)లో జరగబోయే ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో జీతాల పెంపునకు అనుకూలంగా తీర్మానించడానికి ఉన్నతాధికారులు సమ్మతించినట్లు ఎంఎస్‌సీసీల సంఘం నాయకుడొకరు సహచరులకు ఇటీవల టెలికాన్ఫరెన్స్‌ ద్వారా వివరించారు. ఈ పనయ్యే వరకు విషయం బయట చెప్పొద్దని.. ముఖ్యంగా ఏపీఎంలు, అకౌంటెంట్ల వద్ద ప్రస్తావించొద్దని సూచించడం గమనార్హం. వీరి సంభాషణ ఇప్పుడు సంబంధిత శాఖ గ్రూపుల్లో వైరల్‌ కావడంతో వసూళ్ల బాగోతం వెలుగుచూసింది.

మళ్లీ ఆయనే వస్తారు!

రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ వెలుగు మండల సమాఖ్య కార్యాలయాలున్నాయి. ఇందులోని అకౌంటెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఎంఎస్‌సీసీలు హెర్‌ఆర్‌ పాలసీ పరిధిలో లేరు. దీనివల్ల మిగతా సిబ్బందికంటే తక్కువ జీతం వస్తోంది. కొన్నాళ్లుగా తమకు హెచ్‌ఆర్‌ పాలసీ వర్తింపజేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో ఓ అధికారి.. ఈసీ సమావేశం అజెండాలో మీ డిమాండ్లను పెట్టి సానుకూలంగా తీర్మానించేలా చూస్తామని, డబ్బులు సిద్ధం చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు అకౌంటెంట్లు ఒక్కొక్కరు రూ.36 వేలు, ఎంఎస్‌సీసీలు తొలి విడతగా రూ.10 వేల చొప్పున తమ సంఘాల ప్రతినిధుల చేతిలో పెట్టినట్లు సమాచారం. వసూళ్ల వ్యవహారం బయటకు రావడం, అకౌంటెంట్ల డిమాండ్లను తీర్చడం సాధ్యం కాదని తెలిసి ఈ సొమ్ము వెనక్కి ఇచ్చేస్తున్నారు. ‘ఎంఎస్‌సీసీలకు సంబంధించి జీతభత్యాల పెంపు అంశం ఈసీ అజెండాలో ఉంది. నేను స్వయంగా ఆ కాపీ చూశా. ఆమోదం పొందితే పాలసీ వర్తించడంతోపాటు రూ.5 వేల వరకు వేతనం పెరుగుతుంది. కాకపోతే సెర్ప్‌ డైరెక్టర్‌ ఒకరి పదవీకాలం పూర్తవడంతో ఈ సమావేశం వాయిదా పడుతూ వస్తోంది. మళ్లీ ఆయన్నే కొనసాగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనకు ఇచ్చిన హామీ విషయంలో ఆందోళన వద్దని మంత్రి పీఏ చెప్పారు’ అని ఆ సంఘం నేత ఒకరు సహచరులకు వివరించారని సమాచారం.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts