‘దృశ్యం’ చూసి.. తండ్రిని కడతేర్చి

ప్రియుడితో కలిసి తండ్రిని హత్య చేయించిన యువతి స్నేహ కాంబళెను కర్ణాటక రాష్ట్రం బెళగావి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హత్యను ప్రోత్సహించిన ఆమె తల్లి, మృతుడి భార్య

Updated : 30 Sep 2022 09:04 IST

ప్రియుడితో కలిసి కుమార్తె ఘాతుకం

సహకరించిన మృతుడి భార్య

బెళగావి, న్యూస్‌టుడే: ప్రియుడితో కలిసి తండ్రిని హత్య చేయించిన యువతి స్నేహ కాంబళెను కర్ణాటక రాష్ట్రం బెళగావి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హత్యను ప్రోత్సహించిన ఆమె తల్లి, మృతుడి భార్య రోహిణి కాంబళె, స్నేహ ప్రియుడు అక్షయ విఠకర్‌లనూ అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ సంజీవ్‌ పాటిల్‌ తెలిపారు. హత్య తామే చేశామని పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు ‘దృశ్యం’ సినిమాను వారు ముగ్గురు పదిసార్లు చూసినట్లు విచారణ సందర్భంగా ఒప్పుకొన్నారని ఎస్పీ వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ప్రముఖ భూవ్యాపారి సుధీర్‌ కాంబళె (57) ఇటీవల హత్యకు గురయ్యారు. గతంలో ఆయన దుబాయ్‌లో పని చేసేవారు. కరోనా మహమ్మారి సమయంలో బెళగావిలోని క్యాంప్‌ ఏరియాలో ఉంటూ భూవ్యాపారాన్ని పునఃప్రారంభించారు. సుధీర్‌, రోహిణిలకు స్నేహ ఒక్కరే కుమార్తె. మహారాష్ట్రలోని పుణెలో ఒక కళాశాలలో హోటల్‌ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నప్పుడు ఆమెకు అక్షయ్‌ విఠకర్‌ పరిచయమయ్యాడు. వారి ప్రేమ విషయాన్ని సుధీర్‌ ఇటీవల గుర్తించి కుమార్తెను మందలించారు. దీంతో తండ్రి అడ్డు తప్పించాలని ఆమె భావించింది. విషయాన్ని తల్లికి చెప్పగా.. హత్యను ఆమె ప్రోత్సహించింది. తన ప్రియుడిని పుణె నుంచి బెళగావికి సెప్టెంబరు 15న పిలిపించిన స్నేహ.. పథకం ప్రకారం ఓ లాడ్జిలో ఉంచింది. తండ్రి ఇంటి పై అంతస్తులో నిద్రిస్తున్నప్పుడు 17న ఉదయం అక్షయ్‌ను తల్లీబిడ్డలు ఇంటికి పిలిపించారు. సుధీర్‌ కాళ్లు చేతులను వారిద్దరూ పట్టుకోగా.. ఆయన కడుపు, గొంతు, చేతులు, మొహంపై ఓ కత్తితో అక్షయ్‌ ఇష్టానుసారం పొడిచాడు. సుధీర్‌ మరణించారని ధ్రువీకరించుకున్నాక అక్షయ్‌ పుణెకు వెళ్లిపోయాడు. తన భర్తను ఎవరో హత్య చేసి పరారయ్యారని రోహిణి ఇచ్చిన ఫిర్యాదుతో డీసీపీ రవీంద్ర దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఎలా అడిగినా.. వారిద్దరూ ఒకే రకమైన సమాధానాలిచ్చారు. అనుమానంపై తల్లీకుమార్తెల ఫోన్‌కాల్స్‌ను పోలీసులు పరిశీలించారు. స్నేహ క్రమం తప్పకుండా అక్షయ్‌తో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ఆపై విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని