రెండు అత్యాచార కేసుల్లో కామాంధుడికి 30 ఏళ్ల జైలు

కామంతో కళ్లు మూసుకుపోయి ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, మరో ఏడేళ్ల బాబుపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం రెండు కేసుల్లో కలిపి 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.13,000 జరిమానా విధించింది.

Published : 01 Oct 2022 05:52 IST

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, బాబుపై లైంగిక దాడి

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: కామంతో కళ్లు మూసుకుపోయి ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, మరో ఏడేళ్ల బాబుపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం రెండు కేసుల్లో కలిపి 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.13,000 జరిమానా విధించింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కొంగర రాజిరెడ్డి కథనం ప్రకారం.. నిందితుడు సుశీల్‌కుమార్‌ సింగ్‌(35) రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలంలోని కాటేదాన్‌లో ఓ ఆహార ఉత్పత్తి కంపెనీ(ఫుడ్‌ ప్రొడక్ట్‌)లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కంపెనీ అనుబంధంగా ఉన్న నివాస గృహ సముదాయంలో ఉండేవాడు. అతడి భార్య, ముగ్గురు పిల్లలు మాత్రం బిహార్‌లోని సొంతూరులో ఉంటారు. ఒంటరిగా ఉన్న అతడు తాగుడు, ఇతర చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో 2019 మే 4న ఒంటరిగా కనిపించిన చిన్నారి(7)ని సమోసా ఇప్పిస్తానని ఆశ చూపి బుద్వేల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి పరారయ్యాడు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సమగ్ర దర్యాప్తు తర్వాత కోర్టులో నిందితుడిపై పోక్సో చట్టం కింద అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తి ఆర్‌.తిరుపతి నిందితుడికి 20 ఏళ్ల జైలు, రూ.10,000 జరిమానా విధించారు. దీంతోపాటు బాధిత చిన్నారికి రూ.5 లక్షలు నష్టపరిహారం మంజూరు చేయాలంటూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సిఫారసు చేశారు.

ఈ ఘటనకు ముందు 2019 ఏప్రిల్‌ 29న నిందితుడు సుశీల్‌కుమార్‌ సింగ్‌ ఓబాలుడిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. రాజేంద్రనగర్‌ మండలంలో ఓ మైదానంలో ఆడుకుంటున్న బాలుడి(7)కి రేగిపళ్లు కొనిస్తానని ఆశ చూపి సమీపంలోని శ్మశానవాటికకు తీసుకెళ్లి అమానుషంగా లైంగిక దాడి చేశాడు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు తరలించారు. అనంతరం సమగ్ర దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతిక, వైద్య ఆధారాలతో కూడిన అభియోగ పత్రాన్ని కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో న్యాయమూర్తి తిరుపతి నిందితుడికి పదేళ్ల జైలు, రూ.3,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని