రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామని మోసం

మహబూబ్‌నగర్‌లో రెండు పడక గదుల ఇళ్లకు నకిలీ పట్టాలు సృష్టించిన ముఠాను అరెస్టు చేసిన మూడ్రోజుల వ్యవధిలోనే ఇళ్లు ఇప్పిస్తామని వేర్వేరుగా డబ్బు వసూలు చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Published : 01 Oct 2022 05:52 IST

నలుగురి అరెస్ట్‌..

నిందితుల్లో కాంగ్రెస్‌ నేత.. మంత్రి పీఏ కుమారుడు

మహబూబ్‌నగర్‌ నేర విభాగం, న్యూస్‌టుడే: మహబూబ్‌నగర్‌లో రెండు పడక గదుల ఇళ్లకు నకిలీ పట్టాలు సృష్టించిన ముఠాను అరెస్టు చేసిన మూడ్రోజుల వ్యవధిలోనే ఇళ్లు ఇప్పిస్తామని వేర్వేరుగా డబ్బు వసూలు చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మూడు కేసులు నమోదు చేసి వారి వద్ద నుంచి రూ.2.64 లక్షలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మహబూబ్‌నగర్‌ గ్రామీణ ఠాణా సీఐ రాజేశ్వర్‌ గౌడ్‌ శుక్రవారం సాయంత్రం వివరాలు వెల్లడించారు.

ః మహబూబ్‌నగర్‌ సింహగిరి కాలనీకి చెందిన అబ్దుల్‌ సిరాజ్‌ ఖాద్రీ, హబీబ్‌నగర్‌కు చెందిన ఖాదర్‌తో కలిసి రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి ఏడుగురి వద్ద రూ.12.50 లక్షలు వసూలు చేసి, రూ.8 లక్షలు వాడుకున్నారు. సొమ్ములిచ్చిన వారిలో భగీరథ కాలనీకి చెందిన ఆకుల కిరణ్‌కుమార్‌ 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సిరాజ్‌ను అరెస్ట్‌ చేసి రూ.2.50 లక్షల నగదు, ఒక మొబైల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఖాదర్‌ పరారీలో ఉన్నారు.

ః రెండో కేసులో మహబూబ్‌నగర్‌ అస్లాంఖాన్‌ వీధికి చెందిన వనగంటి ప్రకాశ్‌, బోయపల్లి గేట్‌కు చెందిన ఇర్ఫాన్‌తో కలిసి అయిదుగురి వద్ద రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామని రూ.5 లక్షలు తీసుకున్నారు. సుధాకర్‌ అనే వ్యక్తి 27న పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రకాశ్‌, ఇర్ఫాన్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.9 వేలు స్వాధీనం చేసుకున్నారు.

ః మూడో కేసులో మోనప్పగుట్టకు చెందిన అక్షయ్‌కుమార్‌ రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తానని యతిశావుద్దీన్‌ వద్ద రూ.70 వేలు, కేటాయించిన ఇంటిని మార్చడానికి కలాం పాషా నుంచి రూ.30 వేలు తీసుకున్నారు. అక్షయ్‌కుమార్‌ తండ్రి దేవేందర్‌ వద్ద గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన కలాం పాషా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అక్షయ్‌కుమార్‌ నుంచి రూ.5 వేల నగదు, మొబైల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. వీరిలో సిరాజ్‌ ఖాద్రి డీసీసీ ప్రధాన కార్యదర్శి కాగా, అక్షయ్‌కుమార్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అదనపు వ్యక్తిగత కార్యదర్శి దేవేందర్‌ కుమారుడు.

నేనే ఫిర్యాదు చేశా: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
ఈనాడు, హైదరాబాద్‌: రెండు పడకగదుల ఇళ్ల విషయంలో కొందరు డబ్బులు అడుగుతున్నట్లు బాధితులు తన దృష్టికి తేవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ‘‘ఈ ఉదంతంలో ఎవరు ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని కోరాను. పోలీసులు వెంటనే నిందితులను పట్టుకున్నారు. వారికి అభినందనలు. ఇలాంటి వాటిని ఉపేక్షించం. పేదల సంక్షేమ పథకాల్లో ఎవరు అవినీతికి పాల్పడినా మా ప్రభుత్వం సహించదు. దోషులకు దండన తప్పదు’’ అని చెప్పారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని