అన్నీ తెలిసే దారుణం ఆ నలుగురూ మేజర్లే..

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో (సీసీఎల్‌1-4) పాల్గొన్న అయిదుగురు మైనర్లలో నలుగురిని మేజర్లుగా పరిగణించాలని అయిదో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కం ప్రిన్సిపల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ జువెనైల్‌ జస్టిస్‌ (జేజే) బోర్డు అభిప్రాయపడింది.

Updated : 01 Oct 2022 09:49 IST

జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు ప్రకటన

జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనలో కీలక పరిణామం

కేసు బాలల న్యాయస్థానానికి బదిలీ

ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో (సీసీఎల్‌1-4) పాల్గొన్న అయిదుగురు మైనర్లలో నలుగురిని మేజర్లుగా పరిగణించాలని అయిదో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కం ప్రిన్సిపల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ జువెనైల్‌ జస్టిస్‌ (జేజే) బోర్డు అభిప్రాయపడింది. ఈ కేసును నాంపల్లి బాలల న్యాయస్థానాని(12వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి)కి బదిలీ చేసింది. సంఘటన సమయంలో ఈ బాలలు మద్యం, ఇతర మత్తుపదార్థాలు తీసుకోలేదు కనుక వారిపై మత్తు ప్రభావం పడలేదని తెలిపింది. అన్నీ తెలిసే ఈ దారుణానికి పాల్పడినట్టు వారితో మాట్లాడిన సమయంలో గుర్తించినట్లు న్యాయస్థానం పేర్కొంది. తమ చర్యల వల్ల జరిగే పర్యవసానాలపై వారికి పూర్తి అవగాహన ఉందని, వివిధ అంశాలపై వారికి స్పష్టమైన ఆలోచన ఉందని పేర్కొంది. అందువల్ల ఇప్పటివరకు బాలురుగా భావించిన అయిదుగురు మైనర్లలో నలుగురిని కేసు తీవ్రత దృష్ట్యా బోర్డు మేజర్లుగా పరిగణించింది. బాలల న్యాయస్థానంలో విచారణ జరపాల్సిందిగా ఆదేశించింది. సీసీఎల్‌ 5పై మోపిన అభియోగం తీవ్రమైనది కాకపోవటంతో.. అతడి మానసిక స్థితిగతులను అంచనా వేయలేదని బోర్డు పేర్కొంది.

గత మే 28న జూబ్లీహిల్స్‌లోని ఆమ్నీషియా పబ్‌కు వచ్చిన ఓ బాలిక (17)ను అటకాయించిన కొందరు యువకులు కారులో ఎక్కించుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జూన్‌ 2న బాధితురాలి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యాచారంలో పాల్గొన్నవారు రాజకీయ, వ్యాపార కుటుంబాలకు చెందినవారు కావటంతో కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరుగురికి ప్రమేయమున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ (18). మిగిలిన అయిదుగురు మైనర్లు కావటంతో వారిని జువెనైల్‌ హోంకు తరలించారు. ఆ అయిదుగురిని మేజర్లుగా పరిగణించాలంటూ పోలీసులు జువెనైల్‌ జస్టిస్‌ బోర్డును ఆశ్రయించారు. అయిదుగురి మానసిక, శారీరక, కుటుంబ స్థితిగతులపై బోర్డు విచారణ చేపట్టింది. మానసిక నిపుణుల సహకారం కూడా తీసుకుని.. నలుగురిని మేజర్లుగా గుర్తించింది. జువెనైల్‌ బోర్డులో నేరం రుజువైతే గరిష్ఠంగా మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పుడు కేసు బాలల న్యాయస్థానానికి బదిలీ కావటంతో అక్కడ నేరం రుజువైతే 20 ఏళ్ల వరకూ శిక్ష పడొచ్చు.


బాలురపై జేజే బోర్డు అభిప్రాయాలివీ..

సీసీఎల్‌1: ఆర్థికంగా స్థితిమంతమైన కుటుంబానికి చెందినవాడు. కుటుంబంలోని ముగ్గురిలో పెద్దవాడు. జాతీయ ఫుట్‌బాల్‌ జట్టుకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. శారీరకంగా, మానసికంగా వైకల్యం లేదు. పాఠశాల స్థాయిలో ఎన్నో ఆశయాలు కలిగి ఉన్నాడు. చురుగ్గా ఉంటూ మంచి చెడులపట్ల పూర్తి స్పృహలోనే ఉన్నాడు.

సీసీఎల్‌2: ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఇతడికి ఇద్దరు చెల్లెళ్లున్నారు. కుటుంబ సభ్యులతో ప్రేమపూర్వక సంబంధాలున్నాయి. పాఠశాలలో గుర్రపు స్వారీ పోటీల్లో పాల్గొన్నాడు. సంగీత కచేరిలోనూ ప్రతిభ చాటుకున్నాడు. శారీరక, మానసిక ఇబ్బందుల్లేవు. తన చర్యల వల్ల తలెత్తే పర్యవసానాలపై అవగాహన ఉంది.

సీసీఎల్‌3: సీసీఎల్‌1కు ఇతడు బంధువు. ఇద్దరూ జాతీయ ఫుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొన్నారు. లండన్‌లో న్యాయశాస్త్రం చదవాలనేది ఇతడి లక్ష్యం. తల్లిదండ్రులు, అన్నయ్యతో స్నేహపూర్వక సంబంధాలున్నాయి.

సీసీఎల్‌4: ఇతడిదీ ఉన్నత కుటుంబమే. కుటుంబ సభ్యులతో హార్దిక సంబంధాలున్నాయి. ఇటలీలో ఆర్కిటెక్చర్‌ కోర్సు పూర్తి చేయాలనేది ఆశయం. తెలివిగలగవాడు. సామాజిక అంశాలను ఆకళింపు చేసుకోగల పరిజ్ఞానం ఉంది. అప్పుడప్పుడు ధూమపానం అలవాటు ఉంది.


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని