Srikalahasti: మహిళతో శ్రీకాళహస్తి సీఐ దురుసు ప్రవర్తన

ఓ హోటల్‌ నిర్వాహకురాలిపై తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఒకటో పట్టణ సీఐ అంజుయాదవ్‌ దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.

Updated : 02 Oct 2022 08:14 IST

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ఓ హోటల్‌ నిర్వాహకురాలిపై తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఒకటో పట్టణ సీఐ అంజుయాదవ్‌ దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే... గస్తీలో భాగంగా శుక్రవారం రాత్రి పట్టణ సీఐ అంజుయాదవ్‌ స్థానిక స్కిట్‌ కళాశాల సమీపంలోని రోహిత్‌ దాబా వద్దకు వెళ్లారు. అక్కడ కొందరు వ్యక్తులు కూర్చొని మద్యం తాగడంతో దాబా నిర్వాహకుడు హరినాయుడును పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసుల కళ్లుగప్పి ఆయన పారిపోయాడు. దాంతో అమరజ్యోతి కల్యాణ మండపం ఎదురుగా హరినాయుడు భార్య ధనలక్ష్మి నిర్వహిస్తున్న శ్రీహరి మెస్‌ వద్దకు సీఐ వెళ్లి ఆరా తీశారు. ధనలక్ష్మిని కొట్టుకుంటూ లాక్కెళ్లి బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బాధితురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ... ‘సీఐ అంజుయాదవ్‌ ఉద్దేశ పూర్వకంగానే నాపై దాడి చేశారు బూటు కాలితో కొట్టి, తీవ్ర హింసకు గురిచేశారు’ అని వాపోయారు. సీఐ అంజూయాదవ్‌ మాట్లాడుతూ... ‘హరినాయుడు పరారవగా భార్య ధనలక్ష్మిని వాకబు చేశాం. ఆ సమయంలో అక్కడి క్యాష్‌ కౌంటర్‌లో పది మద్యం బాటిళ్లు లభించాయి. పారిపోయేందుకు ప్రయత్నించగా ఆమె చేతిని పట్టుకున్నాను’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని