నయీం డంపులేమైనా ఉన్నాయా..?

కరడుగట్టిన నేరస్థుడు నయీం ప్రధాన అనుచరుడు మద్దునూరి శేషయ్య అలియాస్‌ శేషన్న దందాలపై లోతుగా ఆరా తీయడంపై తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. 2016 షాద్‌నగర్‌ ఎన్‌కౌంటర్‌లో నయీం మృతిచెందిన తర్వాత నుంచి తప్పించుకు తిరుగుతున్న అతడు ఎక్కడెక్కడ దందాలు చేశాడో తెలుసుకునేందుకు పోలీస్‌ కస్టడీ కోసం రెండు రోజుల క్రితం న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated : 02 Oct 2022 05:37 IST

శేషన్న నుంచి సమాచారం రాబట్టడంపై పోలీసుల దృష్టి

5 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: కరడుగట్టిన నేరస్థుడు నయీం ప్రధాన అనుచరుడు మద్దునూరి శేషయ్య అలియాస్‌ శేషన్న దందాలపై లోతుగా ఆరా తీయడంపై తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. 2016 షాద్‌నగర్‌ ఎన్‌కౌంటర్‌లో నయీం మృతిచెందిన తర్వాత నుంచి తప్పించుకు తిరుగుతున్న అతడు ఎక్కడెక్కడ దందాలు చేశాడో తెలుసుకునేందుకు పోలీస్‌ కస్టడీ కోసం రెండు రోజుల క్రితం న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలని విన్నవించారు. న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నయీం బతికున్న రోజుల్లో చేసిన హత్యలు, బెదిరింపుల్లాంటి క్రూరమైన నేరాల్లో శేషన్న ప్రమేయముంది. ఇందుకు సంబంధించి పలు కేసులూ నమోదయ్యాయి. నయీం మరణించిన తర్వాత శేషన్న అలికిడి ఎక్కడా కానరాలేదు. హైదరాబాద్‌లోనే ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం ప్రాంతాల్లో ఉంటున్నా పోలీసులూ పెద్దగా దృష్టి సారించనట్లే కనిపిస్తోంది. పాత కేసుల్లోనూ అతనిపై నాన్‌ బెయిలబుల్‌ వారంట్లున్నా పట్టుకునే ప్రయత్నం చేయలేదనే విమర్శలున్నాయి. ఈనేపథ్యంలో జూన్‌ 16న హుమాయూన్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయుధాల చట్టం కింద కేసు నమోదు కావడంతో టాస్క్‌ఫోర్స్‌, నిఘావర్గాలు అప్రమత్తమయ్యాయి. హుమాయూన్‌నగర్‌లో మహ్మద్‌ అబ్దుల్లా అనే వ్యక్తి ఇంట్లో దొరికిన తుపాకీ శేషన్న ఇచ్చిందే అని దర్యాప్తులో తేలింది.

ఆయుధాల సమాచారంపై ఆరా

నయీం సృష్టించిన నేరసామ్రాజ్యం గురించి శేషన్నకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందనేది పోలీసుల విశ్వాసం. నయీం ఎన్‌కౌంటర్‌ అనంతరం నార్సింగిలోని అతడి ఇంట్లో ఆయుధాలు, నగదు, సెల్‌ఫోన్లు పెద్ద సంఖ్యలో లభించాయి. ‘‘ఇవికాకుండా ఇంకా ఆయుధాలతో పాటు డంపుల సమాచారం శేషన్నకు తెలిసి ఉంటుంది. అలాగే గతంలో దాచిన ఆయుధాలు శేషన్న వద్ద ఉండి ఉంటాయి. నయీం అక్రమంగా కూడగట్టిన ఆస్తులను ఎవరైనా బినామీల పేరిట ఉంచి ఉండొచ్చు. ఇలాంటి విషయాలపై వివరాలను రాబట్టేందుకు శేషన్న కస్టడీ అవసరం’’ అని ఓ పోలీసు అధికారి ‘ఈనాడు’కు వివరించారు. మరోవైపు పాతకేసుల్లో పెండింగ్‌ ఎన్‌బీడబ్ల్యూల సమాచారం క్రోడీకరించడంలోనూ పోలీసులు నిమగ్నమయ్యారు.

తెలంగాణాతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ శేషన్నపై కేసులున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ గోల్కొండ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు అతడిని పీటీ వారంట్‌పై తీసుకెళ్లే ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. అక్కడి పోలీసులు రెండు రోజుల క్రితం గోల్కొండ పోలీసుల్ని సంప్రదించారు. అలాగే నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలోనూ శేషన్నపై మూడు కేసులుండటంతో అక్కడి పోలీసులూ గోల్కొండ పోలీసుల నుంచి వివరాలు సేకరించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని