Hyderabad: ట్రాఫిక్‌ పోలీసులు ఆపారని.. వాహనాన్ని తగలబెట్టాడు

రాంగ్‌రూట్లో వస్తున్నావంటూ ట్రాఫిక్‌ పోలీసు ఆపి, వాహనం తాళం లాక్కున్నందుకు వాహనదారుడు తన బైక్‌పై పెట్రోలు చల్లి నిప్పంటించిన ఘటన ఇది. హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 04 Oct 2022 07:55 IST

అమీర్‌పేట-న్యూస్‌టుడే, ఈనాడు-హైదరాబాద్‌: రాంగ్‌రూట్లో వస్తున్నావంటూ ట్రాఫిక్‌ పోలీసు ఆపి, వాహనం తాళం లాక్కున్నందుకు వాహనదారుడు తన బైక్‌పై పెట్రోలు చల్లి నిప్పంటించిన ఘటన ఇది. హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడకు చెందిన అశోక్‌(45) అమీర్‌పేట మైత్రీవనంలోని అన్నపూర్ణ బ్లాక్‌లో మొబైల్స్‌ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ కింద యూటర్న్‌ తీసుకుని ఎదురుగా ఉన్న అన్నపూర్ణ బ్లాక్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న హోంగార్డు అస్గర్‌ ఆపి.. రాంగ్‌ రూట్లో ఎందుకొస్తున్నారంటూ ప్రశ్నించారు. తన దుకాణం ఎదురుగానే ఉందని చెప్పినా వినిపించుకోలేదని... తాళం లాక్కోవడం అశోక్‌ ఉక్రోశానికి కారణమైంది. తన దుకాణంలోకి వెళ్లి సీసాలో పెట్రోలు తీసుకొచ్చి బైక్‌పై చల్లి నిప్పుపెట్టాడు. దీంతో పూర్తిగా దగ్ధమైంది. తాను అవతలి వైపు నుంచి యూటర్న్‌ తీసుకుని తన దుకాణంలోకి వెళ్తోంటే ఆపారని... అక్కడే ఓ ఖరీదైన కారు రాంగ్‌ రూట్లో వస్తున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎస్సార్‌నగర్‌ ఠాణాకు తరలించారు. అశోక్‌ రాంగ్‌ రూట్లో వస్తుండటంతోనే.. అది ఇతర వాహనదారులకు ప్రమాదమని గుర్తించి హోంగార్డు ఆపారని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం సంయుక్త కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని