కోతులకు భయపడి చెరువులో పడి.. ఇద్దరు బాలుర దుర్మరణం

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో తరచూ  మర్కట మందల తీరు ప్రాణాంతకంగా మారుతోంది. ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజాగా కోతుల దూకుడుకు రెండు నిండు ప్రాణాలు నీట మునిగాయి.

Published : 04 Oct 2022 03:27 IST

మరో ముగ్గురికి తప్పిన ప్రాణాపాయం

మాక్లూర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో తరచూ  మర్కట మందల తీరు ప్రాణాంతకంగా మారుతోంది. ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజాగా కోతుల దూకుడుకు రెండు నిండు ప్రాణాలు నీట మునిగాయి. వారి కుటుంబాలను విషాదంలో నింపాయి. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం  మామిడిపల్లికి చెందిన దీపక్‌(19), రాజేష్‌(14), అఖిలేష్‌(12), అభిలాష్‌(12), హన్మంతు(12) దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా మాల ధరించారు. గ్రామంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం వద్ద రోజూ పూజల్లో పాల్గొంటున్నారు. సోమవారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకొని స్నానాలు చేసేందుకు లింగంచెరువు వద్దకు వెళ్లారు. కట్టపై నడుచుకుంటూ వెళుతుండగా వీరిపైకి కోతుల గుంపు దూసుకొచ్చింది. దీంతో తీవ్రంగా భయపడ్డ వారు ఎటు వెళ్లాలో తెలియక చెరువులోకి దూకారు. ఈత వచ్చిన దీపక్‌ తాను బయటకు రావడంతోపాటు అభిలాష్‌ను కాపాడాడు. మరోవైపు రాజేష్‌ తన తమ్ముడు హన్మంతును ఒడ్డుకు చేర్చాడు. అనంతరం స్నేహితుడు అఖిలేష్‌ను రక్షించేందుకు వెళ్లగా ఇద్దరూ నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు రాజేష్‌ డిచ్‌పల్లి గురుకులంలో ఏడో తరగతి, అఖిలేష్‌ మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. ప్రాణాలు దక్కించుకున్న దీపక్‌ డిగ్రీ ప్రథమ సంవత్సరం, అభిలాష్‌, హన్మంతు స్వగ్రామంలోనే ఆరో తరగతి చదువుతున్నారు. విషయం తెలిసిన గ్రామస్థులు పెద్దసంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని