చిలకలూరిపేటలో బాలుడి కిడ్నాప్‌

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఓ బాలుడిని అపహరించిన దుండగులు.. పోలీసులకు దొరికిపోతామన్న భయంతో వదిలేసి పారిపోయారు. ఎస్పీ రవిశంకర్‌రెడ్డి కథనం మేరకు చిలకలూరిపేటకు చెందిన అరుణ, తమిళనాడులోని తిరువళ్లూర్‌ జిల్లా పేరంబాకానికి చెందిన ధాన్యం వ్యాపారి శరవణన్‌ దంపతులు.

Published : 04 Oct 2022 04:55 IST

పోలీసుల అప్రమత్తతతో వదిలేసిన దుండగులు

చిలకలూరిపేట, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఓ బాలుడిని అపహరించిన దుండగులు.. పోలీసులకు దొరికిపోతామన్న భయంతో వదిలేసి పారిపోయారు. ఎస్పీ రవిశంకర్‌రెడ్డి కథనం మేరకు చిలకలూరిపేటకు చెందిన అరుణ, తమిళనాడులోని తిరువళ్లూర్‌ జిల్లా పేరంబాకానికి చెందిన ధాన్యం వ్యాపారి శరవణన్‌ దంపతులు. దసరా సెలవులు కావడంతో అరుణ తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారింటికి వచ్చారు. ఆదివారం రాత్రి 9.45 గంటలకు కరెంటుపోగా, అదే సమయంలో ఇంటి సమీపంలో ఉన్న చిన్న కుమారుడు రాజీవ్‌సాయి(8)ని ఆగంతుకులు కారులో అపహరించారు. కుటుంబసభ్యులు వెతుకుతుండగానే, రాత్రి 11.45కు పేరంబాకంలోని శరవణన్‌కు ఫోన్‌ చేసి రూ.కోటి ఇవ్వాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయాన్ని బాధితులు పోలీసులకు తెలిపారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్‌, చిలకలూరిపేట అర్బన్‌ సీఐ రాజేశ్వరరావుల ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా దుండగుల లోకేషన్‌ను గుర్తించారు. నెల్లూరు జిల్లా కావలి సమీపంలో హైవేపై పోలీసులు గస్తీ కాస్తుండగా, గమనించిన కిడ్నాపర్లు సర్వీసు రోడ్డులో బాలుడిని వదిలేసి పారిపోయారు. బాలుడిని నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చిన పోలీసులు.. తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్లు ముగ్గురు ఉన్నారని, తమ గురించి నాన్నకు చెబితే చంపేస్తామని బెదిరించారని బాలుడు తెలిపాడు. పోలీసుల కృషిని ప్రశంసించిన మంత్రి విడదల రజిని శాలువాలతో సత్కరించారు.


ఆ కారు విజయవాడకు చెందినది

ఈనాడు, అమరావతి: కిడ్నాపర్లు వినియోగించిన కారు విజయవాడలోని ఓ ట్రావెల్స్‌ సంస్థ వద్ద తేజ అనే వ్యక్తి పేరిట బుక్‌ అయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాలుడు రాజీవ్‌సాయిని కావలిలో విడిచిపెట్టాక దుండగులు వెళ్లిన మార్గాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించి కారు నంబరు రాబట్టారు. కిడ్నాపర్లు సుమారు 70 సార్లు శరవణన్‌కు ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసినట్లు తేలింది. అయితే, అప్పటికే వారిని ఛేదించే పనిలో ఉన్న పోలీసులు.. బాలుడి తండ్రిని వారితో మాట్లాడేలా సూచనలిచ్చారు. తద్వారా కారు వెళ్లే మార్గాన్ని కనిపెట్టగలిగారు. తాను చెన్నై నుంచి బయల్దేరి వస్తున్నానని శరవణన్‌ చెప్పడంతో కిడ్నాపర్లు కావలి దిశగా వెళ్లినట్లు తెలుస్తోంది. చిన్నారిని వదిలేశాక రాంగ్‌రూట్‌లో పరారవడం, ఆ సమయంలో ట్రాఫిక్‌ రద్దీగా ఉండటంతో కారును పట్టుకోలేకపోయామని పోలీసులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని