గుంతల రోడ్డు ప్రాణం తీసింది..

రెండు నెలల చిన్నారి.. ఉన్నట్టుండి అస్వస్థతకు గురైంది.. తల్లిదండ్రులు వైద్యం కోసం ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా రోడ్డు మీద గుంతలు ఆ పసికందు పాలిట మృత్యుపాశాలయ్యాయి.

Published : 05 Oct 2022 03:54 IST

బిడ్డను ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా ప్రమాదం

పసికందు మృతి.. తీవ్రంగా గాయపడిన తండ్రి..

పెద్దాపురం, న్యూస్‌టుడే: రెండు నెలల చిన్నారి.. ఉన్నట్టుండి అస్వస్థతకు గురైంది.. తల్లిదండ్రులు వైద్యం కోసం ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా రోడ్డు మీద గుంతలు ఆ పసికందు పాలిట మృత్యుపాశాలయ్యాయి. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ విషాదకర ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జె.తిమ్మాపురం వద్ద జరిగింది. పెద్దాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ చెంచు గ్రామానికి చెందిన పసికందు అనారోగ్యానికి గురి కావడంతో కాకినాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించాలని స్థానిక వైద్యుడు సూచించారు. బిడ్డను ఎత్తుకుని తల్లిదండ్రులు ద్విచక్రవాహనంపై బయల్దేరగా తోడుగా బంధువులు మరో ద్విచక్ర వాహనంపై వెంటవచ్చారు. జె.తిమ్మాపురం ప్రాంతంలో గుంతలు తేలిన రహదారిపై వాహనం అదుపుతప్పి భర్త, ఒడిలోని బిడ్డతో సహా భార్య కిందపడిపోగా భర్త తలకు తీవ్ర గాయమైంది. బంధువులు వెంటనే పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అతడికి ప్రథమ చికిత్స చేసిన వైద్యులు తల్లి ఒడిలో ఉన్న శిశువును పరిశీలించి అప్పటికే బిడ్డ మృతి చెందిందని తేల్చారు. ఒకవైపు కన్నుమూసిన పసికందు.. మరోవైపు గాయపడిన వ్యక్తికి మెరుగైన చికిత్స అందాల్సిన పరిస్థితి. చేసేదిలేక బంధువులు చిన్నారి మృతదేహంతోనే కాకినాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారని పోలీసులు పేర్కొన్నారు. బిడ్డ చికిత్స కోసం ఆసుపత్రికి బయలుదేరిన ఆ తండ్రి.. గతుకుల రోడ్లకు చిన్నారి బలైపోగా.. అతడు ఆసుపత్రిపాలయ్యాడు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts