సరదాగా వస్తే సముద్రం మింగేసింది

సూర్యలంక సముద్ర తీరంలో పెను విషాదం చోటుచేసుకుంది. దసరా సెలవుల్లో సరదాగా గడుపుదామని విహారయాత్రకు వచ్చిన ఎనిమిదిమంది బాలల్లో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు.

Published : 05 Oct 2022 03:54 IST

సూర్యలంక బీచ్‌లో ముగ్గురు చిన్నారుల మృతి

సముద్రంలో మునిగి మరో ముగ్గురి గల్లంతు

బాధితులంతా విజయవాడ వాసులే

బాపట్ల, న్యూస్‌టుడే: సూర్యలంక సముద్ర తీరంలో పెను విషాదం చోటుచేసుకుంది. దసరా సెలవుల్లో సరదాగా గడుపుదామని విహారయాత్రకు వచ్చిన ఎనిమిదిమంది బాలల్లో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మినహా మిగతావారంతా 7 నుంచి 10వ తరగతి చదువుతున్నారు. ఈ దుర్ఘటన మంగళవారం జరిగింది. బాపట్ల గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విజయవాడ నగరం అజిత్‌సింగ్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన వసంత పరిశుద్ధ, చందల కైలాస్‌, భాజం అభిలాష్‌, చింతల సాయి ప్రణదీప్‌, చెరుకూరి సాయిమధు, నల్లపు రాఘవ, ప్రభుదాసు, వెంకట ఫణికుమార్‌ సూర్యలంక బీచ్‌లో విహారానికి ప్రణాళిక వేసుకున్నారు. ఇంట్లో మాత్రం కనకదుర్గ దర్శనానికి వెళ్తున్నట్లు చెప్పారు. మొత్తం ఎనిమిది మంది ఉదయాన్నే పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో బాపట్ల చేరుకున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా సముద్రం పోటు ఎక్కువగా ఉంది. కైలాస్‌ (13) మినహా ఏడుగురు నడుం లోతుకు వెళ్లి స్నానం చేస్తుండగా పెద్ద అలలు వచ్చి నీటిలో కొట్టుకుపోయారు. రక్షించమంటూ కేకలు వేశారు. బీచ్‌లో విధుల్లో ఉన్న సూర్యలంక మెరైన్‌, బాపట్ల గ్రామీణ పోలీసులు స్పందించి వసంత పరిశుద్ధను కాపాడి ఒడ్డుకు చేర్చారు. నీటిలో మునిగిపోయిన అభి (17), సిద్ధు (17), సాయి మధు (17)ను పోలీసు సిబ్బంది ఒడ్డుకు తీసుకువచ్చినా అప్పటికే వారు మృతిచెందారు. రాఘవ (17), ఫణికుమార్‌ (14), ప్రభుదాసు (17) సముద్రంలో గల్లంతయ్యారు. వారి కోసం మెరైన్‌ పోలీసు సిబ్బంది, ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ సందర్శించారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో విషాదం నెలకొంది.

గజ ఈతగాళ్లకు జీతాల్లేవట  
ఈ బీచ్‌లో వరసగా ప్రమాదాలు జరుగుతుండడంతో జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు ఈ ఏడాది జూన్‌లో పది మంది గజ ఈతగాళ్లను నియమించారు. అప్పటి నుంచి వారు 16 మంది ప్రాణాలను కాపాడారు. అయితే నిధుల సమస్య కారణంగా వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. జీతాలివ్వకుంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తంచేస్తూ.. నెలకు రూ. 15,000 చొప్పున ఇప్పించాలని వారు గత నెలలో వేడుకున్నారు. అయితే నిధులు లేవంటూ అధికారులు ఈతగాళ్లను విధుల నుంచి తప్పించారు. వారు ఉండి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని స్థానికులు అంటున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts