ఐస్‌క్రీమ్‌ వ్యాపారి.. స్మగ్లర్‌గా మారి..!

ఐస్‌క్రీమ్‌ వ్యాపారంలో నష్టపోయిన ఓ వ్యాపారి  ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఎర్రచందనం స్మగ్లర్‌ అవతారమెత్తాడు.

Published : 05 Oct 2022 03:54 IST

కడప నుంచి హైదరాబాద్‌ తెచ్చి విక్రయానికి ఏర్పాట్లు

నలుగురి అరెస్టు.. 500 కిలోల దుంగలు స్వాధీనం

ఈనాడు, హైదరాబాద్‌: ఐస్‌క్రీమ్‌ వ్యాపారంలో నష్టపోయిన ఓ వ్యాపారి  ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఎర్రచందనం స్మగ్లర్‌ అవతారమెత్తాడు. హైదరాబాద్‌లోని మిథాని దగ్గర కొందరికి విక్రయించేందుకు వచ్చి దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌, కంచన్‌బాగ్‌ పోలీసులకు దొరికిపోయాడు. అతనితోపాటు మరో ముగ్గుర్ని అరెస్టు చేశారు. దీనివెనుక ప్రధాన సూత్రధారి, స్మగ్లర్‌ కడప జిల్లాకు చెందిన రవిచంద్ర పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.75 లక్షల విలువైన 500 కిలోల దుంగల్ని పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ సంయుక్త కమిషనర్‌ కార్తికేయ మంగళవారం విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

బడా స్మగ్లర్‌తో లింకులు..!
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన షేక్‌ అబ్దుల్లా (42) ఐస్‌క్రీమ్‌ వ్యాపారి. నష్టాలు రావడంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఎంచుకున్నాడు. లంకమల్ల రిజర్వు ఫారెస్టు నుంచి ఎర్రచందనం సేకరించి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే బడా స్మగ్లర్‌ రవిచంద్ర (మైదుకూరు) నుంచి కొన్ని దుంగలను కొన్నాడు. హైదరాబాద్‌లో ఎర్రచందనం కొనేవారిని సంప్రదించి నమూనాగా చూపించేందుకు రెండు దుంగలు తీసుకొచ్చాడు. వాటిని చూసి పెద్దమొత్తంలో ఆర్డర్‌ రావడంతో కడప నుంచి దుంగలు తెప్పించి కల్వకుర్తిలో ఒకరి స్థలంలో నిల్వ చేశాడు. దీనిపై అటవీ శాఖ అధికారులకు ఉప్పందగా.. హైదరాబాద్‌ దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు కంచన్‌బాగ్‌లోని మిథాని బస్‌ డిపో దగ్గర నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. నిందితుల వద్ద పెద్దమొత్తంలో సరకు ఉందని.. దానిపై ఆరా తీస్తున్నామని సంయుక్త కమిషనర్‌ వివరించారు. నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని చెప్పారు. స్మగ్లింగ్‌ను అడ్డుకున్న అధికారులను హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ అభినందించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts