రెవెన్యూ కార్యాలయంలో మహిళ ఆత్మహత్యాయత్నం

ప్రభుత్వం కేటాయించిన భూమికి హద్దులు చూపకపోగా, అధికారులు బెదిరించి సంతకాలు చేయించుకుంటున్నారంటూ ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఇది.

Published : 05 Oct 2022 03:54 IST

భూమికి హద్దులు చూపకపోవడంపై ఆందోళన

బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే: ప్రభుత్వం కేటాయించిన భూమికి హద్దులు చూపకపోగా, అధికారులు బెదిరించి సంతకాలు చేయించుకుంటున్నారంటూ ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఇది. బాధితురాలి కుటుంబసభ్యుల కథనం.. వైయస్‌ఆర్‌ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని సోమిరెడ్డిపల్లె యాదవనగర్‌కు చెందిన తమ్మిశెట్టి గురమ్మకు 2009లో అసైన్‌మెంట్‌ కమిటీ సిఫార్సు మేరకు ప్రభుత్వం కొంత భూమిని కేటాయించింది. తర్వాత కసూర్బా విద్యాలయం నిర్మాణానికంటూ గురమ్మతో పాటు తమ్మిశెట్టి వెంకటసుబ్బమ్మ, మరొకరికి చెందిన 4.5 ఎకరాల భూమిని తీసుకుంది. ప్రత్యామ్నాయంగా ఎస్సీకాలనీ సమీపంలో భూములు కేటాయించి, పట్టాదారు పాసు పుస్తకాలు అందించింది. కాని, పొలాలకు హద్దులు చూపలేదు. లబ్ధిదారులు సాగు చేసుకునేందుకు పొలాల వద్దకు వెళ్తే స్థానికులు ఆ భూములు తమకే చెందాలంటూ అడ్డుకునేవారు. ఈ సమస్యపై గురమ్మ పలుమార్లు అధికారులకు, చివరకు గవర్నర్‌కూ విన్నవించారు. తాజాగా స్పందనలో ఫిర్యాదు చేశారు. డిప్యూటీ తహసీల్దార్‌ సంజీవరెడ్డి సూచనలతో గుర్రమ్మ, ఆమె కుమారుడు వెంకటసుబ్బయ్య, వెంకటసుబ్బమ్మ మంగళవారం డీటీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ అధికారులతో వాగ్వాదం జరిగింది. స్పందన ఫిర్యాదుపై సంతకం చేయాలంటూ అధికారి ఒత్తిడి తేగా, సమస్యకు పరిష్కారమైతేనే తాము సంతకం చేస్తామంటూ బాధితులు పట్టుబట్టారు. ఆగ్రహించిన అధికారి మీపై కేసు పెడతానంటూ బెదిరించడంతో వెంట తెచ్చుకున్న విష ద్రావణం తాగారని బాధితులు చెప్పారు. కిందపడిపోయిన గురమ్మను ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని