మూడేళ్ల క్రితం నుంచే పన్నాగం

బాల్యం నుంచి ప్రభావం చూపిన ఘటనలు.. రెచ్చగొట్టే ప్రసంగాలు.. నరనరాన పేరుకుపోయిన విద్వేషం.. అతన్ని తీవ్రవాదిగా మార్చాయి. ఉగ్ర కుట్రలో ప్రధాన సూత్రధారి, మూసారంబాగ్‌కు చెందిన అబ్దుల్‌ జాహెద్‌(39) దసరా నాడు గ్రనేడ్ల దాడితో బీభత్సం సృష్టించాలనుకున్నాడు.

Published : 05 Oct 2022 05:46 IST

ఉగ్ర దాడికి నిధులు, ఆయుధాల సేకరణ

మనోహరాబాద్‌ నుంచి నగరానికి గ్రనేడ్లు

అబ్దుల్‌ జాహెద్‌ కనుసన్నల్లోనే పేలుళ్లకు కుట్ర

సిమ్‌ లేని ఫోన్‌ ద్వారా ఫర్హతుల్లా ఘోరీతో మంతనాలు

రిమాండ్‌ రిపోర్టులో పోలీసుల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: బాల్యం నుంచి ప్రభావం చూపిన ఘటనలు.. రెచ్చగొట్టే ప్రసంగాలు.. నరనరాన పేరుకుపోయిన విద్వేషం.. అతన్ని తీవ్రవాదిగా మార్చాయి. ఉగ్ర కుట్రలో ప్రధాన సూత్రధారి, మూసారంబాగ్‌కు చెందిన అబ్దుల్‌ జాహెద్‌(39) దసరా నాడు గ్రనేడ్ల దాడితో బీభత్సం సృష్టించాలనుకున్నాడు. ఇది ఇప్పటికిప్పుడు రూపొందించిన ప్రణాళిక కాదు.. మూడేళ్ల క్రితం నుంచే పన్నిన పన్నాగం. దీన్ని అమలు చేసేందుకు అవసరమైన నిధులు, ఆయుధాలు సమకూర్చుకున్నాడు. రాష్ట్రంలో మతకల్లోలం, పోలీసులపై దాడులకు తెగబడేందుకు సిద్ధమయ్యాడు. అందుకు అదను కోసం ఎదురుచూస్తున్న క్షణంలో నగర పోలీసులు కుట్రను భగ్నం చేయడంతో విధ్వంసం తప్పింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను సోమవారం అరెస్ట్‌ చేసిన పోలీసులు మంగళవారం జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించారు. మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదుల పన్నిన ఎత్తుగడలను రిమాండ్‌ రిపోర్టులో పొందుపరిచారు. నివేదికలో పోలీసులు పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి.

ఇదీ.. జాహెద్‌ ‘ఉగ్ర’ కోణం
జాహెద్‌పై బాబ్రీ మసీదు, గోద్రా ఘటనలు బాల్యంలోనే ప్రభావం చూపాయి. మౌలానా అనే వ్యక్తి ప్రసంగాలు మరింత విద్వేషాన్ని నూరిపోశాయి. స్థానికంగా ఎన్నో గొడవల్లో పాలుపంచుకున్నా.. 2005లో సికింద్రాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై ఆత్మాహుతి దాడితో ఇతడి పేరు మొదటిసారి బయటకు వచ్చింది. ఈ దాడిలో పాల్గొన్న బంగ్లాదేశ్‌కు చెందిన డాలిన్‌కు జాహెద్‌ వసతి కల్పించాడు. ఆటోలో టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం వద్దకు తీసుకెళ్లినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించి జాహెద్‌ను అరెస్ట్‌ చేశారు. రియాద్‌లోని తన సోదరుడు అబ్దుల్‌ సమీద్‌ ఆదేశాలతోనే ఇలా చేసినట్టు జాహెద్‌ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ కేసులో విచారణ ఖైదీగా జాహెద్‌ 12 ఏళ్లు ఏపీ, తెలంగాణలలోని జైళ్లలో ఉన్నాడు. అయితే అతడు నేరం చేశాడనేదానికి సరైన సాక్ష్యాధారాలు లేవంటూ న్యాయస్థానం 2017లో నిర్దోషిగా విడుదల చేసింది. జైలు నుంచి వచ్చాక తన గురించి బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. మొబైల్‌ ఫోన్‌ వాడేవాడు కాదు.

పాక్‌ నుంచే హవాలా డబ్బు
పాకిస్థాన్‌లోని ఫర్హతుల్లా ఘోరీ నుంచి జాహెద్‌కు ఎప్పటికప్పుడు ఆదేశాలు అందుతుండేవి. హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా యువతను ఉగ్రవాదం వైపు ఆకట్టుకునేందుకు, రిక్రూట్‌మెంట్‌ కోసం హవాలా మార్గంలో పలువురి నుంచి రూ.33 లక్షలు జాహెద్‌కు చేరాయి. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి 4 గ్రనేడ్లను తీసుకెళ్లాలంటూ  గత నెలలో ఫర్హతుల్లా ఘోరీ నుంచి వాట్సప్‌లో  ఆదేశాలందాయి. సెప్టెంబరు 28న సమీయుద్దీన్‌ మనోహరాబాద్‌ వెల్లి.. మరుసటి రోజు(29న) నగరానికి వచ్చి 4 గ్రనేడ్లను జాహెద్‌కు అప్పగించాడు. వాటిలో సమీయుద్దీన్‌, మాజ్‌కు ఒక్కోటి ఇచ్చి జాహెద్‌ 2 గ్రనేడ్లను తన వద్ద ఉంచుకున్నాడు. హవాలా ద్వారా అందిన సొమ్ముతోనే జాహెద్‌ కారు కూడా కొనుక్కున్నాడు.

భారీ ప్రాణ నష్టం.. మతఘర్షణలే లక్ష్యం
దసరా వేడుకలు, భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ బహిరంగ సభలపై గ్రనేడ్లను ప్రయోగించాలనేది లక్ష్యం. భారీ ప్రాణనష్టం వాటిల్లేలా చూడాలని, హైదరాబాద్‌ నగరంలోనూ, రాష్ట్రవ్యాప్తంగా మతఘర్షణలతో మారణహోమం సృష్టించాలనేది వారి ఉగ్ర పన్నాగం.  అందుకు దసరా వేడుకలను ఎంపిక చేసుకున్నారు. అనుమానితులు, పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు వారిని పట్టుకుని కుట్రను భగ్నం చేశారు.

మూడేళ్లుగా ఘోరీతో మంతనాలు
అబ్దుల్‌ జాహెద్‌ జైలు నుంచి విడుదలైన రోజు మహ్మద్‌ సమీయుద్దీన్‌ అలియాస్‌ అబ్దుల్‌ సమి(39) భారీ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. రోజూ సాయంత్రం జాహెద్‌ చంపాపేటకు వెళ్లి సమీయుద్దీన్‌కు చెందిన ఫోన్‌ (సిమ్‌ లేకుండా) యాప్‌లో పాకిస్థాన్‌లోని ఫర్హతుల్లా ఘోరీతో సంభాషించేవాడు.  ఛాటింగ్‌ చేసేవాడు. మూడో నిందితుడు మాజ్‌ హసన్‌ ఫరూఖ్‌ అలియాస్‌ మాజ్‌(29) మెహిదీపట్నం హుమాయున్‌నగర్‌ రాయల్‌కాలనీ నివాసి. యూట్యూబ్‌లో అన్వర్‌ అలీ అవాకీ ప్రసంగాలను విని జిహాద్‌ వైపు ఆకర్షితుడయ్యాడు. బాసిత్‌ అనే యువకుడితో కలిసి ఐసిస్‌లో చేరేందుకు సిరియా ప్రయాణమయ్యాడు. జమ్మూ-కశ్మీర్‌లో వీరిద్దరూ పట్టుబడ్డారు. బాసిత్‌ను తిహాడ్‌ జైలుకు, మాజ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలులో ఇతడికి జాహెద్‌ పరిచయమయ్యాడు. ముగ్గురూ కలిసి ఉగ్రవాద కార్యకలాపాలను వ్యాప్తి చేసేందుకు సిద్ధమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని