రైతుబంధు సొమ్ము రుణం కింద జమ!

పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన రైతుబంధు నగదును పంట రుణం నవీకరణకు జమ చేసుకుంటామని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Published : 07 Oct 2022 05:00 IST

బ్యాంకు అధికారుల తీరుతో రైతు ఆత్మహత్యాయత్నం

మాచారెడ్డి, న్యూస్‌టుడే: పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన రైతుబంధు నగదును పంట రుణం నవీకరణకు జమ చేసుకుంటామని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయిన రాజుకు రెండెకరాల పట్టాభూమి ఉంది. రైతుబంధు పథకం కింద ప్రభుత్వం వానాకాలం సీజన్‌లో రూ.10 వేలు మంజూరు చేసింది. భవిష్యత్తు అవసరాల కోసం ఖాతాలోనే దాచుకున్నారు. రెండు రోజుల కిందట డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా అధికారులు పంట రుణం కింద రూ.8 వేలు జమ చేసుకుంటాం. మిగిలిన రూ.2 వేలు తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు, రైతు మధ్య వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన రాజు గురువారం సాయంత్రం మద్యంలో పురుగుల మందు కలిపి తాగారు. మొదట బ్యాంకు వద్దకు వెళ్లగా అప్పటికే మూసివేసి ఉండటంతో ఠాణాకు వెళ్లారు. బ్యాంకు అధికారుల తీరుతో విసుగు చెంది పురుగుల మందు తాగానని చెప్పారు. పోలీసులు హుటాహుటిన రైతును సమీపంలోని పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. తదుపరి మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts