Crime News: మంచూరియా తినలేదని.. అమ్మమ్మను కొట్టిచంపిన మనవడు

అమ్మమ్మ కోసం మనవడు గోబి మంచూరియా తెస్తే.. ఆమె తినేందుకు నిరాకరించింది. వాటిని విసిరికొట్టడంతో కోపంతో ఆ యువకుడు ఆమెను కర్రతో కొట్టాడు.

Updated : 08 Oct 2022 08:37 IST

శవాన్ని గోడలో దాచిపెట్టి తల్లీకొడుకుల పరారీ

ఆరేళ్ల తర్వాత నిందితుల అరెస్టు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: అమ్మమ్మ కోసం మనవడు గోబి మంచూరియా తెస్తే.. ఆమె తినేందుకు నిరాకరించింది. వాటిని విసిరికొట్టడంతో కోపంతో ఆ యువకుడు ఆమెను కర్రతో కొట్టాడు. దీంతో అమ్మమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం శవాన్ని గోడలో పెట్టి సిమెంటు వేసి పారిపోయిన మనవడు, అతడి తల్లిని ఆరేళ్ల తరువాత పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగర పరిధి కెంగేరి ఉపనగరలో తన కుమార్తె శశికళ(46), మనవడు సంజయ్‌(26)తో కలిసి శాంతకుమారి(69) ఉండేవారు. శాంతకుమారి అతి శుభ్రాన్ని పాటించేవారు. పది, ఇంటర్మీడియట్లో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన సంజయ్‌.. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో చేరాడు. 2016 ఆగస్టులో తన అమ్మమ్మ కోసం గోబి మంచూరియా పార్సిల్‌ తీసుకువచ్చాడు. దాన్ని శాంతకుమారికి అందించగా.. ఆమె ఆ పొట్లాన్ని మనవడిపైకి విసిరికొట్టింది. దీంతో సంజయ్‌ కోపంతో ఊగిపోతూ రాగి సంగటి కలిపే కట్టెతో శాంతకుమారిని కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ విషయం పోలీసులకు చెబుదామని తల్లి శశికళ తన కుమారుడికి చెప్పగా.. తనను అరెస్టు చేసి జైలులో పెడతారని, నీవు ఒంటరి అయిపోతావని హెచ్చరించాడు. మృతదేహాన్ని బయటకు తీసుకువెళ్లడం కష్టమవుతుందని భావించి.. కుంబళగోడులో ఉంటున్న నందీశ్‌ అనే స్నేహితుడికి ఫోన్‌ చేసి సంజయ్‌ ఇంటికి పిలిపించుకున్నాడు. ముగ్గురూ కలిసి ఇంట్లోని బీరువాలో శవాన్ని ఉంచారు. దుర్వాసన రాకుండా శవానికి రసాయనాలు, సుగంధ ద్రవ్యాలు పూశారు. అనంతరం ఇంట్లో గోడకు రంధ్రం చేసి మృతదేహాన్ని అందులో ఉంచి ప్లాస్టరింగ్‌ చేసి.. రంగులు వేశారు. హత్య జరిగిన 3 నెలల తర్వాత తాము ఊరికి వెళ్లి వస్తామని ఇంటి యజమానికి చెప్పి తల్లీ, కుమారుడు వెళ్లిపోయారు. వారు తిరిగి రాకపోవడంతో ఇంటికి మరమ్మతు చేయించేందుకు 2017 మే 7న తాళాలు పగలగొట్టిన ఇంటి యజమాని లోపలికి వెళ్లి చూడగా శాంతకుమారిని పూడ్చిపెట్టిన గోడకు, చీరపై రక్తం మరకలు కనిపించాయి.

ఇంట్లో పోలీసులు సోదా చేయగా.. సంజయ్‌ వదిలి వెళ్లిన ఫోన్‌ కనిపించింది. కాల్‌ డేటా ఆధారంగా నందీశ్‌ను అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారంతో గోడను తవ్వి శవాన్ని బయటకు తీశారు. ఇంటి నుంచి పరారైన శశికళ, సంజయ్‌ మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో ఉన్నారు. ఒక హోటల్‌లో సంజయ్‌ సప్లయిర్‌గా, శశికళ అంట్లు కడిగే పనిలో చేరారు. మహారాష్ట్రకు వెళుతున్నామని  శశికళ వారి బంధువులు, స్నేహితులను చెప్పిన మాట ఆధారంగా, పలు పట్టణాల్లో గాలించి, చివరకు నిందితులను అరెస్టు చేశామని కెంగేరి ఠాణా ఇన్‌స్పెక్టర్‌ వసంత్‌ తెలిపారు. శుక్రవారం నిందితులను ఇక్కడికి తీసుకువచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని