Honeytrap: కర్ణాటకలో హనీట్రాప్‌నకు మఠాధిపతి బలి!

కర్ణాటకలోని కంచుగల్‌ బండె మఠాధిపతి బసవలింగ మహాస్వామి సోమవారం వేకువజామున ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర చర్చకు దారితీసింది.

Updated : 27 Oct 2022 12:03 IST

బసవలింగస్వామి ఆత్మహత్య

రామనగర, న్యూస్‌టుడే: కర్ణాటకలోని కంచుగల్‌ బండె మఠాధిపతి బసవలింగ మహాస్వామి సోమవారం వేకువజామున ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర చర్చకు దారితీసింది. ఓ మహిళను అడ్డంపెట్టుకుని స్వామీజీని కొందరు హనీట్రాప్‌ చేశారని.. ఆ ఒత్తిడి, వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. బెంగళూరుకు చెందిన ఓ మహిళతో ఆయన కొద్ది రోజులుగా వీడియో ఛాటింగ్‌ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. మఠాధిపతి ఛాటింగ్‌ను, వీడియోలను బయటపెడతామని బెదిరింపులు రావడంతో ఆయన మానసిక ఆందోళనకు లోనై ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. కేసు గురించి రామనగర్‌ ఎస్పీ సంతోష్‌ బాబు మాట్లాడుతూ.. స్వామీజీ తన డెత్‌ నోట్‌లో కొందరి పేర్లను ప్రస్తావించారు. అయితే.. ఆయన మరణానికి, సూసైడ్‌ నోట్‌లో ఉన్న వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. మాగడిలోని కుదూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా.. నిందితులుగా ఇంకా ఎవరి పేర్లూ పేర్కొనలేదని చెప్పారు. స్వామీజీ నిజంగానే వేధింపులకు గురయ్యారా? లేదా? అన్నది తెలియాల్సి ఉందని.. కేసులో ఎవరెవరు ఉన్నారనేది దర్యాప్తు ద్వారా తెలుస్తుందని ఎస్పీ తెలిపారు. అయితే.. ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించిన కేసులో మురుగ మఠంలోని చీఫ్‌ పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావు నిందితుడు. శివమూర్తి అరెస్టైన తరువాత.. నిందితుల వలలో 45 ఏళ్ల బసవలింగ స్వామి చిక్కుకున్నారని.. వారి వేధింపుల వల్లనే స్వామి బలవన్మరణానికి పాల్పడ్డారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు మఠం ఆస్తులు, బ్యాంకు ఖాతాల వివరాలను సిద్ధగంగ మఠం నుంచి వచ్చిన ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. మఠం నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా బెంగళూరులో గురువణ్ణ మఠానికి అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని