Gujarat Bridge Collapse: 78 మంది జలసమాధి

గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మోర్బీ నగరంలో మచ్చు నదిపై బ్రిటిష్‌ పాలన కాలం నాటి ఓ తీగల వంతెన ఆదివారం సాయంత్రం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 78 మంది దుర్మరణం పాలయ్యారు.

Updated : 31 Oct 2022 08:06 IST

గుజరాత్‌లో బ్రిటిష్‌ కాలం నాటి వంతెన కూలడంతో ఘోరం
మరమ్మతులు పూర్తయిన నాలుగు రోజులకే ఘటన

మోర్బీ, దిల్లీ: గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మోర్బీ నగరంలో మచ్చు నదిపై బ్రిటిష్‌ పాలన కాలం నాటి ఓ తీగల వంతెన ఆదివారం సాయంత్రం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 78 మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారు. నదిలో గల్లంతయినవారిలో పలువురి జాడ ఇంకా తెలియరాలేదని.. మృతుల సంఖ్య మరింత పెరిగే ముప్పుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజా విషాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సెలవురోజు కావడంతో..

మోర్బీ నగరంలోని మచ్చు నదిపై నిర్మించిన ఝూల్తా పుల్‌ (వేలాడే వంతెన) స్థానికంగా ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. దాదాపు 7 నెలలపాటు కొనసాగిన మరమ్మతుల అనంతరం.. గుజరాతీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ నెల 26న దాన్ని తిరిగి తెరిచారు. నాలుగు రోజుల నుంచే సందర్శకులను వంతెన మీదకు మళ్లీ అనుమతిస్తున్నారు. దీపావళి సెలవులకు తోడు ఆదివారం కూడా కావడంతో ఝూల్తా పుల్‌ వద్ద పర్యాటకుల రద్దీ బాగా కనిపించింది. వంతెనపైకి వందల మంది చేరారు. అక్కడి అందాలను వీక్షిస్తూ మైమరచిపోయారు. కొంతమంది అటూఇటూ పరుగులు తీస్తూ ఆనందంగా ఆడుకుంటూ కనిపించారు. అయితే సందర్శకుల సంఖ్య మరీ ఎక్కువ కావడంతో.. ఊహించని ఘోరం జరిగిపోయింది. అధిక బరువును మోయలేక సాయంత్రం దాదాపు 6:30 గంటలకు వంతెన ఒక్కసారిగా కూలిపోయింది.

వంతెన కూలిపోవడంతో దానిపై ఉన్న జనం నదిలో పడిపోయారు. నీటిలోతు ఎక్కువగా ఉన్నచోట్ల ఈత రానివారు మునిగిపోయారు. తక్కువ లోతు ఉన్న ప్రాంతాల్లో కొందరు ఛాతీ వరకు నీటిలో మునిగి హాహాకారాలు చేస్తూ కనిపించారు. కొంతమంది ఒకరిపై ఒకరు పడిపోవడంతో గాయపడ్డారు. ఇంకొందరు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని.. తీగలను పట్టుకొని వేలాడుతూ కనిపించారు. నీళ్లలో మునిగిపోతున్న పక్కవారిని రక్షించేందుకు మరికొందరు ప్రయత్నించారు. సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రత్యక్షమయ్యాయి. వంతెన కూలిపోయిన సమయంలో దానిపై దాదాపు 400-500 మంది ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక విభాగం అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది, కొంతమంది స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతయినవారి కోసం పడవల సహాయంతో అన్వేషణ చేపట్టారు. గాయపడ్డవారిని ఆసుపత్రులకు తరలించారు. గాంధీనగర్‌, వడోదరాల నుంచి వచ్చిన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

భూపేంద్ర పటేల్‌తో మాట్లాడిన మోదీ

తాజా దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సీఎం భూపేంద్రతో మాట్లాడిన ఆయన.. సహాయక చర్యలపై ఆరా తీశారు. మృతుల కుటుంబసభ్యులకు రూ.2 లక్షల చొప్పున, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబసభ్యులకు రూ.4 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు భూపేంద్ర తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని