Andhra News: 6 నెలల గర్భిణి తోసివేత.. ఉపసర్పంచి భార్యపై వైకాపా సర్పంచి దాష్టీకం

ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండలం దుగ్గిరాలపాడుకు చెందిన వైకాపా ఉప సర్పంచి కోపూరు రాంబాబు భార్య, ఆరు నెలల గర్భిణి ప్రమీలారాణిని అదే పార్టీకి చెందిన సర్పంచి జడ రాంబాబు నెట్టేసి గాయపరిచిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.

Updated : 07 Nov 2022 07:27 IST

మైలవరం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండలం దుగ్గిరాలపాడుకు చెందిన వైకాపా ఉప సర్పంచి కోపూరు రాంబాబు భార్య, ఆరు నెలల గర్భిణి ప్రమీలారాణిని అదే పార్టీకి చెందిన సర్పంచి జడ రాంబాబు నెట్టేసి గాయపరిచిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఆమెను మైలవరంలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బాధితురాలు ప్రమీలారాణి, ఆమె భర్త రాంబాబు, పోలీసుల కథనం మేరకు.. దుగ్గిరాలపాడులో ప్రమీలారాణి బుక్‌ కీపర్‌గా పని చేస్తున్నారు. ఆమెను సర్పంచి రాంబాబు గత జనవరిలో విధుల నుంచి తప్పించారు. బాధితురాలు ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించగా విధుల్లోకి తీసుకోవాలంటూ ఆగస్టులో ఆదేశాలు జారీ చేసింది. వాటిని పాటించని సర్పంచి అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రమీలారాణిని చేర్చుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయమై శనివారం సర్పంచి రాంబాబును ప్రమీలారాణి నిలదీయగా.. అతడు కోపంగా నెట్టి వేయడంతో ఆమె కిందపడి గాయాలపాలయ్యారు. బాధితురాలిని ఆదివారం ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు బి.రాజు పరామర్శించారు. ఎస్సీ మహిళ, గర్భిణి అని చూడకుండా అన్యాయంగా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై ‘న్యూస్‌టుడే’ సర్పంచి రాంబాబును వివరణ కోరగా.. స్వయం సహాయక సంఘాల సభ్యులు చేసిన అభియోగాల నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించామని తెలిపారు. ఇందులో తన ప్రమేయం లేదని, తాను ఆపై ఎలాంటి దౌర్జన్యానికి పాల్పడలేదని చెప్పారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నామని, కేసు నమోదు చేస్తామని ఎస్సై ధర్మరాజు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని