Cheating: నమ్మకమనే‘ముద్ర’ వేసి.. ఆశలను ఛిద్రం చేసి

కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ను పోలినట్టు సంస్థ పేరు ఉండటం.. కార్యాలయాలపై మోదీ చిత్రంతోపాటు పాస్‌పుస్తకాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అని ముద్రించడం..

Updated : 09 Nov 2022 06:51 IST

కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అంటూ మోసం
రూ.కోట్లు కొల్లగొట్టి ఖాతాదారులకు టోకరా
తెలుగు రాష్ట్రాల్లో వేలల్లో బాధితులు

ఈనాడు, వరంగల్‌: కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ను పోలినట్టు సంస్థ పేరు ఉండటం.. కార్యాలయాలపై మోదీ చిత్రంతోపాటు పాస్‌పుస్తకాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అని ముద్రించడం.. సంస్థ కార్యక్రమాల్లో పలువురు ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొనడం.. చాలామందిని నిజంగా కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థేనని నమ్మేలా చేసింది. తమ కష్టార్జితంతో సంపాదించిన సొమ్మును పొదుపు ఖాతాల్లోనూ, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుగానూ పెట్టారు. తీరా సంస్థ బోర్డు తిప్పేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల మంది రూ.కోట్లలో నష్టపోయారు.

బ్యాంకుల్లోలాగే పాస్‌పుస్తకాలు, బాండ్లు..

‘ముద్ర అగ్రికల్చర్‌ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌’ సంస్థను 2017లో ఏర్పాటుచేశారు. ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో 300 శాఖలను ఏర్పాటు చేశాం. టర్నోవర్‌ రూ.100 కోట్లు దాటింది. త్వరలో రూ.1,000 కోట్లకు చేరుకుంటుంది’’ అని వ్యవస్థాపకుడు టి.రామదాసప్పనాయుడు ఖాతాదారులు, ఉద్యోగులతో నిర్వహించిన సమావేశాల్లో చెప్పేవారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పదుల సంఖ్యలో శాఖలను ఏర్పాటుచేశారు. తమ సంస్థలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే ఏడాదికి 24% వడ్డీ ఇస్తామని, రోజూ రూ.500 కడితే ఏడాదికి దాదాపు రూ.15 వేలు అదనంగా చెల్లిస్తామని, రుణాలూ ఇస్తామని ఆశచూపారు. దీంతో చాలామంది రోజుకు రూ.50 నుంచి రూ.500 వరకు జమ చేశారు. రెండేళ్ల వరకు చెల్లింపులు బాగానే చేయడంతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లూ తెరిచారు. బ్యాంకుల్లో ఇచ్చినట్టే వారికి పాస్‌పుస్తకాలు, బాండ్లు ఇచ్చారు. తమ సొమ్ము ఇక తిరిగివస్తుందని ఖాతాదారులు ఎదురుచూస్తున్న సమయంలో ఏడాది కిందట సంస్థను అకస్మాత్తుగా మూసేశారు. దీంతో వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలంలో సుమారు 650మంది బాధితులు రూ.80లక్షలు, జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ శాఖలో రూ.1.5 కోట్ల వరకు నష్టపోయారు. వరంగల్‌ నగరంతో పాటు మహబూబాబాద్‌, జనగామ, హనుమకొండ జిల్లాల్లో పెద్దసంఖ్యలో బాధితులున్నారు. మహబూబాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయం వద్ద కొన్ని నెలల కిందట ఓ బాధితుడు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. మోసంపై వరంగల్‌ జిల్లా పర్వతగిరి పీఎస్‌లో, హైదరాబాద్‌లోని నల్లకుంట ఠాణాలో పలువురు ఫిర్యాదు చేశారు. ‘‘రోజుకు రూ.500 చొప్పున మొత్తం రూ.రెండు లక్షల వరకు పొదుపు చేశాను. బోర్డు ఎత్తేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను’’ అని పర్వతగిరికి చెందిన దయాకర్‌ తెలిపారు. ‘‘ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్ల కోసం కూలీ డబ్బులు రూ.లక్ష వరకు పొదుపు చేశాను. తీరా మా పైసలు ఇవ్వకుండా మోసం చేశారు’’ అని వరంగల్‌ జిల్లా వడ్లకొండకు చెందిన పట్టాపురం శారద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలంటూ గతంలో మేనేజర్లుగా పనిచేసినవారి చుట్టూ పలువురు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనిలో ఉద్యోగిగా పనిచేసిన ఒక యువతి ఖాతాదారుల ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యానికి గురై మరణించారు.

ఉద్యోగులకూ వంచన

సంస్థలో చేరిన ఉద్యోగులనూ నిర్వాహకులు మోసం చేశారు. ఉద్యోగ భద్రత ఉంటుందని నమ్మించి ఒక్కొక్కరి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో రూ.1.5 లక్షల వరకు వసూలు చేశారు. అందులో నుంచే నెలనెలా రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వేతనాలు చెల్లించారు. ఈ విషయమై వరంగల్‌ జిల్లా సహకార అధికారి సంజీవ్‌రెడ్డిని ‘ఈనాడు’ సంప్రదించగా.. ‘ముద్ర సంస్థ’ మల్టీ స్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ యాక్ట్‌ కింద రిజిస్టరైందని.. దీనిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర సహకార శాఖకు లేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని