Nandigama: రూ.20 వేలకు.. రూ.60 వేలు కట్టినా వదల్లేదు

వృద్ధాప్యంలో ఉన్న తమను కుమారుడు కంటికి రెప్పలా చూసుకుంటాడని కలలుగన్న ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. రుణయాప్‌ వలలో చిక్కిన కుమారుడు..

Updated : 13 Nov 2022 07:01 IST

రుణయాప్‌ వేధింపులతో యువకుడి ఆత్మహత్య

నందిగామ, న్యూస్‌టుడే: వృద్ధాప్యంలో ఉన్న తమను కుమారుడు కంటికి రెప్పలా చూసుకుంటాడని కలలుగన్న ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. రుణయాప్‌ వలలో చిక్కిన కుమారుడు.. తీసుకున్న రుణానికి మూడురెట్లు కట్టినా నిర్వాహకులు వదిలిపెట్టలేదు. అప్పు ఇంకా చెల్లించాలంటూ వేధింపులు ఎక్కువవడంతో భరించలేక రైలు కింద పడి అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో శనివారం వెలుగుచూసిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామకు చెందిన సాయిచరణ్‌ (24) పదో తరగతి పూర్తి చేసి.. స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. వృద్ధులైన తల్లిదండ్రులకు అతడే ఆధారం. సాయిచరణ్‌ తన ఆర్థిక అవసరాల కోసం స్మార్ట్‌ఫోన్‌లో లోన్‌యాప్‌ ద్వారా నెల రోజుల క్రితం రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఇప్పటివరకు దాదాపు రూ.60 వేలు చెల్లించాడు. ఇందుకు ద్విచక్రవాహనాన్ని సైతం అమ్మాడు. తీసుకున్న రుణానికి ఇంకా వడ్డీ చెల్లించాలంటూ.. ఫోన్‌లో వేధింపులు అధికమయ్యాయి. తట్టుకోలేకపోయిన యువకుడు గురువారం రాత్రి భోజనం అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. శనివారం తెల్లవారుజామున నందిగామ సమీపంలో రైలు పట్టాల పక్కన సాయిచరణ్‌ శవమై కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని