Drugs Case: డ్రగ్‌ డాన్‌కు రెక్కలొచ్చాయ్‌..!

డ్రగ్స్‌ కేసులో పోలీసులు గోవాలో మూడు నెలలపాటు ఆపరేషన్‌ చేసి పట్టుకొచ్చిన ఘరానా నిందితుడు ఎడ్విన్‌ బుధవారం బెయిల్‌పై విడుదలయ్యాడు.

Updated : 17 Nov 2022 10:13 IST

బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదల
హెచ్‌-న్యూ పోలీస్‌ బృందానికి గట్టి ఎదురుదెబ్బ
పీడీచట్టం ప్రయోగించేలోపే తప్పించుకున్న ఎడ్విన్‌

ఈనాడు, హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో పోలీసులు గోవాలో మూడు నెలలపాటు ఆపరేషన్‌ చేసి పట్టుకొచ్చిన ఘరానా నిందితుడు ఎడ్విన్‌ బుధవారం బెయిల్‌పై విడుదలయ్యాడు. గోవా డ్రగ్‌ డాన్‌.. మత్తు మాఫియా కింగ్‌పిన్‌ అని పోలీసులు పేర్కొన్న నిందితుడు పదకొండు రోజుల్లోనే విడుదల కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అతడికి బెయిల్‌ రాకుండా ఉండేందుకు బలమైన ఆధారాల్ని న్యాయస్థానంలో సమర్పించడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శ వినిపిస్తోంది. నార్కొటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డీపీఎస్‌) యాక్ట్‌ కింద ఎడ్విన్‌ను అరెస్టు చేసిన పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అతడిపై పీడీ చట్టం ప్రయోగించడంతోపాటు గోవాలో అతడి ఆస్తుల్ని జప్తు చేయించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు.  సాధారణంగా ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కటకటాల పాలైతే నెలల తరబడి నాలుగు గోడలకే పరిమితం కావాల్సిన పరిస్థితుల్లో మాదకద్రవ్యాల దందాలో ఆరితేరిన కీలక నేరస్థుడు ఇలా విడుదలవ్వడం పోలీస్‌శాఖలో సంచలనం రేకెత్తించే అంశంగా మారిపోయింది.

మత్తు దందాలో కీలకంగా..

గోవా నుంచి మాదకద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్‌ను అడ్డుకోగలిగితేనే  స్థానిక యువతను మత్తు వలయం నుంచి కాపాడొచ్చనే ఉద్దేశంతో హైదరాబాద్‌ పోలీసులు కీలక ఆపరేషన్లను చేపట్టారు. ఈక్రమంలోనే ప్రత్యేకంగా హైదరాబాద్‌ నార్కొటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌-న్యూ) నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. మత్తు దందాలో కీలకమైన ఎడ్విన్‌ కోసం న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి మరీ ఈనెల 5న గోవా నుంచి పట్టుకొచ్చారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఎడ్విన్‌ అరెస్ట్‌ను ఓ కీలక పరిణామంగా హెచ్‌న్యూ పోలీసులు చెప్పుకొన్నారంటేనే అతడి పాత్ర ఏమిటనేది అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఎడ్విన్‌ అనూహ్యంగా బెయిల్‌ పొందడం పోలీసులకు ఎదురుదెబ్బేననే చర్చ సాగుతోంది.

మరో రెండు కేసుల్లో ముందస్తుగానే బెయిల్‌

వాస్తవానికి ఎడ్విన్‌పై ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద హైదరాబాద్‌లో రాంగోపాల్‌పేట, ఉస్మానియా యూనివర్సిటీ, లాలాగూడ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. వీటిల్లో రాంగోపాల్‌పేట ఠాణా కేసులో ఈనెల 5న అరెస్ట్‌ చేశారు. అయితే అంతకుముందే మిగిలిన రెండు ఠాణాల్లోని కేసుల్లో ఎడ్విన్‌ ముందస్తుగా బెయిల్‌ పొందాడు. ఈనేపథ్యంలోనే రాంగోపాల్‌పేట కేసులో ఎడ్విన్‌ చంచల్‌గూడ జైల్లో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉండగానే.. మిగిలిన రెండు కేసుల్లో ముందస్తు బెయిళ్లను రద్దు చేయించాలని హెచ్‌న్యూ బృందం కసరత్తు చేసింది. ఈ మూడు కేసుల ఆధారంగా ఎడ్విన్‌పై పీడీ చట్టం ప్రయోగించి ఏడాదిపాటు కటకటాలకే పరిమితం చేయడం ద్వారా గోవా డ్రగ్‌ సర్కిల్‌లో వణుకు పుట్టించాలని భావించింది. కానీ ఎడ్విన్‌కు నాంపల్లిలోని మొదటి అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు బుధవారం బెయిల్‌ మంజూరుచేసింది. ప్రతి ఆదివారం రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలన్న షరతు విధించింది. అనంతరం ఎడ్విన్‌ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని