Hyderabad: ఉత్తుత్తి యాప్‌తో బురిడీ.. గొలుసుకట్టు మోసంలో విస్తుపోయే వాస్తవాలు

‘రూ.లక్ష పెట్టుబడితో.. 8 నెలల్లోనే రూ.4 కోట్లు మీ సొంతం’ అంటూ వేలమందిని బురిడీ కొట్టించిన మల్టీజెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గొలుసు కట్టు దందా వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

Updated : 18 Nov 2022 08:11 IST

రూ.100 కోట్లకుపైనే లావాదేవీల గుర్తింపు

ఈనాడు- హైదరాబాద్‌, చర్లపల్లి, న్యూస్‌టుడే: ‘రూ.లక్ష పెట్టుబడితో.. 8 నెలల్లోనే రూ.4 కోట్లు మీ సొంతం’ అంటూ వేలమందిని బురిడీ కొట్టించిన మల్టీజెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గొలుసు కట్టు దందా వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు, మల్టీజెట్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ టేకుల ముక్తిరాజ్‌ నకిలీ యాప్‌తో బాధితుల్ని బురిడీ కొట్టించాడు. సాధారణంగా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌కు సెబీ గుర్తించిన సాంకేతికతను వినియోగించాలి.

నిందితుడు తన పథకాన్ని అమలుచేసేందుకు సొంతంగా మల్టీజెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో యాప్‌ తయారు చేయించాడు. బంగారం, బొగ్గు, గ్యాస్‌పై ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేయించి.. నిజంగానే లావాదేవీలు జరిగినట్లు నమ్మించాడు. పెట్టుబడి పెట్టాక తొలుత కొందరికి లాభాలు అందించాడు. వీటిని నమ్మి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టాక బోర్డు తిప్పేయాలని చూశాడు. నగరంలోని ఓ జైలు సిబ్బందితో కలిసి ముక్తిరాజ్‌ చేసిన మోసాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకురావడంతో నిందితుడు పరారయ్యాడు. ఈ మోసంపై కేసు నమోదు చేసిన సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

బ్యాంకు ఖాతాల్లో రూ.12 లక్షలే..

ముక్తిరాజ్‌ రూ.100 కోట్లకుపైనే మోసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతడు తయారు చేయించిన యాప్‌లోని లావాదేవీల ఆధారంగా ఈ మొత్తాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో మల్టీజెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రియల్‌ లైఫ్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ సంస్థ పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయగా, రూ.12 లక్షలు మాత్రమే ఉన్నట్లు తేలింది. మిగిలిన డబ్బును వారం క్రితమే డ్రా చేసినట్లు తెలిసింది. ఇంత పెద్దమొత్తంలో డబ్బును ఎలా మళ్లించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముక్తిరాజ్‌ కుటుంబీకులు, సంస్థలో పనిచేసిన వ్యక్తులు సహా మరికొందరి బ్యాంకు ఖాతాలనూ పరిశీలించనున్నారు. కార్యాలయానికి వెళ్లి కట్టిన సొమ్మును ఎక్కడ దాచారనే అంశంపైనా ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు మల్టీ జెట్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాప్‌ తయారుచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని