మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వ్యక్తిగత అదనపు కార్యదర్శి కుమారుడి ఆత్మహత్య

రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వ్యక్తిగత అదనపు కార్యదర్శి దేవేందర్‌ కుమారుడు అక్షయ్‌కుమార్‌(23) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Updated : 22 Nov 2022 08:10 IST

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌ - గచ్చిబౌలి, న్యూస్‌టుడే: రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వ్యక్తిగత అదనపు కార్యదర్శి దేవేందర్‌ కుమారుడు అక్షయ్‌కుమార్‌(23) ఆత్మహత్యకు పాల్పడ్డారు. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇన్‌స్పెక్టర్‌ గోనె సురేష్‌ వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లోని మోనప్పగుట్టకు చెందిన దేవేందర్‌ కుమారుడు అక్షయ్‌కుమార్‌ బీటెక్‌ పూర్తి చేశారు. గచ్చిబౌలిలో ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగం రావడంతో పదిరోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. మేనబావ గల్లా నవీన్‌కుమార్‌ వద్ద ఉంటూ ఉద్యోగానికి వెళ్లి వస్తున్నారు. ఆయన ఈ నెల 20న స్వగ్రామానికి వెళ్లడంతో అక్షయ్‌కుమార్‌ ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. సోమవారం ఉదయం 11గంటలకు నవీన్‌ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఫ్లాట్‌ తలుపులు వేసి ఉన్నాయి. ఎంత పిలిచినా అక్షయ్‌ తలుపులు తీయకపోవడంతో మారుతాళం చెవితో లోనికి వెళ్లి చూడగా పడకగదిలో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని, గదిలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ దొరకలేదని పోలీసులు తెలిపారు. మహబూబ్‌నగర్‌లో రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో సెప్టెంబరు 30న గ్రామీణ ఠాణా పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అందులో అక్షయ్‌కుమార్‌ కూడా ఉన్నారు. ఆయన ఇద్దరు వ్యక్తుల నుంచి డబ్బు తీసుకున్నారని పోలీసులు అరెస్టు సమయంలో వెల్లడించారు. తర్వాత బెయిలుపై బయటకు వచ్చి కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో అక్షయ్‌ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని