విద్యుదాఘాతంతో పొగలు.. తల్లి మృతి

ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయి పొగలు వ్యాపించి.. తల్లి మృతి చెందగా, ఇద్దరు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.

Published : 24 Nov 2022 04:14 IST

ప్రాణాపాయస్థితిలో ఇద్దరు పిల్లలు

అనంతపురం నేరవార్తలు, న్యూస్‌టుడే: ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయి పొగలు వ్యాపించి.. తల్లి మృతి చెందగా, ఇద్దరు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి అనంతపురంలో జరిగింది. వన్‌టౌన్‌ సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గోరంట్ల మండలం మందలపల్లికి చెందిన మల్లికార్జున.. తన భార్య అరుణ (38), పిల్లలు నిత్యసాయి, ఫల్గుణతో కలిసి నగరంలోని శారదానగర్‌లో ఉంటున్నారు. ఆయన రెడ్డిపల్లి వ్యవసాయ కార్యాలయంలో తాత్కాలిక డ్రైవరుగా పని చేస్తున్నారు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తుండగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. తిరిగి సరఫరా కాగానే ఇంటి వరండాలో ఉన్న విద్యుత్తు మీటర్‌ బాక్సులో షార్ట్‌ సర్క్యూట్‌ అయింది. అక్కడ సోఫాలు ఉండటంతో నిప్పురవ్వలు వాటిపై పడి పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. భయపడిన మల్లికార్జున ఇంట్లో నుంచి బయటకు వచ్చి కాపాడాలని గట్టిగా కేకలు వేశారు. స్థానికులు వెంటనే విద్యుత్తు, అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. విద్యుత్తు అధికారులు సరఫరా నిలిపివేశారు. ఇంట్లోకి వెళ్లి చూడగా అరుణ, ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలో ఉన్నారు. 108కు సమాచారం ఇవ్వడంతో వారిని ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు అరుణ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని