నకిలీ ధ్రువపత్రాల డోర్‌ డెలివరీ

అడ్డదారిలో ఉద్యోగాలు పొందేందుకు పలువురు నకిలీ ధ్రువపత్రాల కోసం వాటిని తయారుచేసే ముఠాల్ని సంప్రదించడం చూస్తుంటాం.

Published : 24 Nov 2022 04:43 IST

అనుత్తీర్ణులు, కోర్సు మధ్యలో ఆపేసిన వారి  వివరాలు తెలుసుకొని మరీ విక్రయం
ఆ సర్టిఫికెట్లతో పలువురు విదేశాలకు
ముఠా గుట్టు రట్టు.. ముగ్గురి అరెస్టు
పరారీలో వేఫోర్‌ కన్సల్టెన్సీ డైరెక్టర్‌

ఈనాడు, హైదరాబాద్‌- నాగోలు, న్యూస్‌టుడే: అడ్డదారిలో ఉద్యోగాలు పొందేందుకు పలువురు నకిలీ ధ్రువపత్రాల కోసం వాటిని తయారుచేసే ముఠాల్ని సంప్రదించడం చూస్తుంటాం. ఈ ముఠా మరో అడుగు ముందుకేసి అనుత్తీర్ణులను, కోర్సులు మధ్యలో ఆపేసిన వారిని వెదికి పట్టుకొని రెండేళ్లుగా నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తోంది. ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ, చైతన్యపురి పోలీసులు ఈ ముఠాలో ముగ్గురిని అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 9 విశ్వవిద్యాలయాల పేరుతో ముద్రించిన  నకిలీ సర్టిఫికెట్లు, పలు గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నకిలీ ధ్రువపత్రాలు కొన్న విద్యార్థుల్లో కొందరు అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలకూ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ బుధవారం ఈ వివరాలు వెల్లడించారు.

ఫ్లెక్సీ దుకాణంలో నకిలీ సర్టిఫికెట్ల ముద్రణ

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మిర్యాల ఆనంద్‌కుమార్‌(47) హైదరాబాద్‌ చైతన్యపురిలో ఫ్లెక్సీ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఫైన్‌ ఆర్ట్స్‌ పూర్తి చేసిన అతడు అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు నకిలీ ధ్రువపత్రాల తయారీ మొదలుపెట్టాడు. ఇందుకోసం మలక్‌పేటకు చెందిన రికో ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ డైరెక్టర్‌ మల్లెపాక హేమంత్‌ (35), సరూర్‌నగర్‌లో వేఫోర్‌ ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ డైరెక్టర్‌ కల్యాణ్‌ను సంప్రదించాడు. వీరు తమ వద్దకు వచ్చే విద్యార్థుల ద్వారా వివిధ కోర్సుల్లో అనుత్తీర్ణులు, కళాశాల మధ్యలో మానేసిన వారి వివరాలు సేకరించేవారు. ఆయా విద్యార్థులు, తల్లిదండ్రులను సంప్రదించి ధ్రువపత్రాలు ఇప్పిస్తామని, వాటి ద్వారా విదేశాలకు వెళ్లొచ్చని నమ్మించేవారు. ఆనంద్‌కుమార్‌ ఫొటో షాప్‌లో నకిలీ పట్టాలు తయారుచేసి తన ఫ్లెక్సీ దుకాణంలోనే ముద్రించేవాడు. ఒక్కో ధ్రువపత్రాన్ని హేమంత్‌కుమార్‌, కల్యాణ్‌లకు రూ.3 వేలకు అమ్మేవాడు. అనంతరం వారు విద్యార్థులకు రూ.50 వేల నుంచి రూ.60 వేలకు విక్రయించేవారు. ఈ సర్టిఫికెట్లు తీసుకున్న వారికి వీసా వస్తే మరింత డబ్బు వసూలు చేసేవారు. వేఫోర్‌ ఓవర్సీస్‌ కన్సల్టెన్సీలో వీసా ప్రాసెసింగ్‌ కౌన్సిలర్‌ షేక్‌ షాహీన్‌(30) సైతం ఈ అక్రమంలో భాగస్వామిగా గుర్తించారు. వీరు వందల మంది విద్యార్థులకు కోరిన విద్యార్హత సర్టిఫికెట్లతోపాటు, వివిధ బ్యాంకుల పత్రాలు సమకూర్చినట్లు  పోలీసులు తెలిపారు. ఆనంద్‌కుమార్‌, హేమంత్‌, షేక్‌ షాహీన్‌లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వేఫోర్‌ కన్సల్టెన్సీ డైరెక్టర్‌ చిక్కితే మరిన్ని వివరాలు వెల్లడవుతాయని చెబుతున్నారు. నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్నవారిలో విదేశాలకు వెళ్లిన వారి వివరాలు అతడి వద్ద ఉన్నాయని సమాచారం.

నిందితుల వద్ద ఉస్మానియా యూనివర్సిటీవి 10, జేఎన్‌టీయూ 14, గీతం 12, ఆంధ్రా యూనివర్సిటీ 8, ఆచార్య నాగార్జున 6, గుల్బర్గా 6, ఎస్‌ఆర్‌ఎం 4, అన్నామలై 4, కాకతీయ వర్సిటీవి 3 సర్టిఫికెట్లు లభించాయి. జీఆర్‌ఈ అర్హత పత్రాలు 10, ఇంటర్‌, పది సర్టిఫికెట్లు 11 దొరికాయి. పలు నకిలీ బోనఫైడ్లు, టీసీ, ఆధార్‌కార్డులు, రికమండేషన్‌ లెటర్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని