ఆఫ్తాబ్‌ చంపి ముక్కలు చేస్తానన్నాడు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది.

Updated : 24 Nov 2022 05:56 IST

రెండేళ్ల కిందటే పోలీసులకు శ్రద్ధా లేఖ

దిల్లీ, ముంబయి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. తనను చంపేందుకు ఆఫ్తాబ్‌ ప్రయత్నిస్తున్నాడని, శవాన్ని ముక్కలుచేసి పారేస్తానని బెదిరించాడని పేర్కొంటూ... శ్రద్ధా రెండేళ్ల కిందటే మహారాష్ట్ర పోలీసులకు లేఖ రాసింది! ఆఫ్తాబ్‌ పాల్ఘర్‌ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో అక్కడి తులిన్జ్‌ ఠాణా పోలీసులకు 2020, నవంబరు 23న ఈ లేఖను చేరవేసింది. ‘‘ఆఫ్తాబ్‌ తరచూ కొడుతున్నాడు. ఈరోజు ఊపిరాడకుండా చేసి చంపేందుకు ప్రయత్నించాడు. నన్ను చంపి, ముక్కలుగా నరికి పారేస్తానని బెదిరించాడు. ఆరు నెలలుగా నన్ను హింసిస్తున్నాడు. చంపుతాడన్న భయంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నా. పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో ఇంతకాలం అతడితో ఉన్నా. ఇకపై ఆఫ్తాబ్‌తో కలిసి జీవించాలని లేదు. మేమిద్దరం సహజీవనం సాగిస్తున్నామని, అతడు నన్ను కొడుతున్నాడని, చంపేందుకు ప్రయత్నించాడని ఆఫ్తాబ్‌ తల్లిదండ్రులకు తెలుసు. వారాంతాల్లో వారు మా వద్దకు వచ్చి పోతుంటారు’’ అని శ్రద్ధా అందులో పేర్కొంది. పొరుగు వ్యక్తి ద్వారా ఆమె ఈ లేఖను పంపినట్టు పోలీసులు బుధవారం వెల్లడించారు. లేఖ నేపథ్యంలో విచారణ నిమిత్తం వారి ఇంటికి వెళ్లగా... సమస్య పరిష్కారమైందంటూ శ్రద్ధా తన ఫిర్యాదును వెనక్కు తీసుకుందని పోలీసులు చెప్పారు.

జ్వరం రావడంతో పాలిగ్రాఫ్‌ పరీక్ష నిలిపివేత

కోర్టు అనుమతితో ఆఫ్తాబ్‌కు మంగళవారం పాలిగ్రాఫ్‌ పరీక్ష ప్రారంభిచామని.. అతడికి జలుబు, జ్వరం ఉండటంతో బుధవారం పరీక్షను కొనసాగించలేదని రోహిణిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఆరోగ్యం కుదుటపడ్డాక పాలిగ్రాఫ్‌ పరీక్షను కొనసాగిస్తామని, అది పూర్తయ్యేంత వరకూ నార్కో ఎనాలసిస్‌ పరీక్ష చేపట్టే అవకాశంలేదని చెప్పారు. ఈ కేసులో కీలక ఆధారాలను చేజిక్కించుకునేందుకు దిల్లీ పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. నిందితుడి కుటుంబ సభ్యులను దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. ఆవేశంలోనే శ్రద్ధాను చంపినట్టు దిల్లీ కోర్టుకు ఆఫ్తాబ్‌ మంగళవారం వెల్లడించాడు. అతని తరఫు న్యాయవాది మాత్రం నిందితుడు ఎక్కడా నేరాన్ని అంగీకరించలేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని