Hyderabad: బరి తెగించిన డ్రగ్స్‌ ముఠా.. అధికారుల కారుని ఢీకొట్టి..

మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే సమాచారంతో అరెస్టు చేసేందుకు వెళ్లిన ఆబ్కారీ శాఖ అధికారులపై ఓ ముఠా ఎదురుదాడికి దిగింది. కారుతో ఢీకొట్టి పారిపోయేందుకు యత్నించింది. సినీ ఫక్కీలో వెంబడించిన అధికారులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

Updated : 25 Nov 2022 07:21 IST

వెంటాడి ముగ్గుర్ని అరెస్టు చేసిన ఆబ్కారీ సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే సమాచారంతో అరెస్టు చేసేందుకు వెళ్లిన ఆబ్కారీ శాఖ అధికారులపై ఓ ముఠా ఎదురుదాడికి దిగింది. కారుతో ఢీకొట్టి పారిపోయేందుకు యత్నించింది. సినీ ఫక్కీలో వెంబడించిన అధికారులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని రాయదుర్గంలో జరిగింది. హైదరాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సీహెచ్‌ విజయ్‌ గురువారం ఆబ్కారీ భవన్‌లో వివరాలను వెల్లడించారు. ముంబయిలో డ్రగ్స్‌ కొనుగోలు చేసిన కొందరు హైదరాబాద్‌లో విక్రయించేందుకు తెస్తున్నారని సమాచారం అందింది. జిల్లా టాస్క్‌ఫోర్స్‌, జూబ్లీహిల్స్‌ అధికారులు జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.36లోని మెట్రో స్టేషన్‌ వద్ద బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో తనిఖీలు చేపట్టారు. ముంబయిలోని శాంతాక్రజ్‌కు చెందిన గుల్‌హసన్‌ఖాన్‌ అనుమానాస్పదంగా కనిపించడంతో సోదాలు చేయగా 5 గ్రాముల మిథైల్‌ ఎడియోక్సీ మెథాంఫెటమిన్‌(ఎండీఎంఏ) లభ్యమైంది. డ్రగ్స్‌ విక్రయించేందుకు మరో ఇద్దరితో కలిసి కారులో హైదరాబాద్‌ వచ్చినట్లు అతను చెప్పడంతో వారి కోసం అధికారులు గచ్చిబౌలిలోని సంపూర్ణ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లారు. వీరిని చూసి కారులో ఉన్న ఇద్దరు నిందితులు పరారయ్యేందుకు యత్నించారు. డివైడర్‌ను ఢీకొట్టినా ఆగలేదు. అధికారులు వాహనంతో వారి కారును ఓవర్‌టేక్‌ చేసి రోడ్డుకు అడ్డంగా ఆపారు. నిందితులు అధికారుల వాహనాన్ని ఢీకొట్టి దూసుకెళ్లడంతో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షణాల్లో తేరుకొన్న అధికారులు నిందితుల్ని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. 40 గ్రాముల ఎండీఎంఏ గుర్తించారు. వారిని ముంబయిలోని బాంద్రాకు చెందిన సలీం అహ్మద్‌ రెహ్మాన్‌ అన్సారీ, శాంతాక్రజ్‌కు చెందిన ఎండీ రిజ్వాన్‌గా గుర్తించారు. ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మరో ఘటనలో ఆంధ్రా ఒడిశా బోర్డర్‌(ఏవోబీ) నుంచి తీసుకొచ్చిన హ్యాష్‌ ఆయిల్‌తో ముగ్గురు పట్టుబడ్డారని విజయ్‌ తెలిపారు. బోరబండలో సోదాలు నిర్వహించగా.. స్థానికుడైన తెనుగోలు కృష్ణ, కడెం అక్షయ్‌లు 10 గ్రాముల హ్యాష్‌ ఆయిల్‌తో పట్టుబడ్డారు. వీరిచ్చిన సమాచారంతో చేకూరి మణికుమార్‌ నుంచి 25 గ్రాముల హ్యాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో హైదరాబాద్‌ ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.కరుణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని