Warangal: ఆర్థిక ఇబ్బందులతో యువ దంపతుల ఆత్మహత్య

వరంగల్‌ నగరం గిర్మాజీపేటలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక యువ దంపతులు గురువారం రసాయనం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉప్పుల సతీశ్‌ (నవధన్‌)(33), స్రవంతి(28) దంపతులు కొంతకాలంగా అప్పుల కారణంగా ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు.

Updated : 25 Nov 2022 07:59 IST

ములుగురోడ్డు(వరంగల్‌), న్యూస్‌టుడే: వరంగల్‌ నగరం గిర్మాజీపేటలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక యువ దంపతులు గురువారం రసాయనం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉప్పుల సతీశ్‌ (నవధన్‌)(33), స్రవంతి(28) దంపతులు కొంతకాలంగా అప్పుల కారణంగా ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. ఇద్దరు పిల్లలు విరాట్‌, బింటు సహా బలవన్మరణానికి పాల్పడాలని నిశ్చయించుకున్నారు. ముందుగా పెద్ద కుమారుడికి తీర్థం అని చెప్పి రసాయనం ఉన్న సీసా ఇవ్వగా నోట్లో పోసుకోగానే రుచి నచ్చక ఉమ్మేశాడు. ఆ తర్వాత సతీశ్‌, స్రవంతి తాగారు. తల్లిదండ్రుల ప్రవర్తనలో మార్పు చూసిన విరాట్‌ మరో గదిలో ఉన్న నానమ్మకు చెప్పాడు. ఆమె హుటాహుటిన వచ్చి చూసేసరికి కుమారుడు, కోడలు పడిపోయి ఉన్నారు. వారిద్దర్నీ స్థానికులు, సతీశ్‌ సోదరుడు బాలు, కుటుంబ సభ్యులు వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందారని నిర్ధారించారు. విరాట్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. చిన్న కుమారుడు బింటు నానమ్మ, తాతయ్యలతో వేరే గదిలో ఉండటంతో ఘటన నుంచి బయటపడ్డాడు.

ఏ వ్యాపారం కలిసి రాక..

స్వర్ణకార వృత్తి కలిసిరాకపోవడంతో సతీష్‌, ఆయన అన్న బాలు జగిత్యాలకు వెళ్లి కొంతకాలం ఉన్నారు. అక్కడా నిలదొక్కుకోలేదు. దీంతో వరంగల్‌కు తిరిగి వచ్చేసిన ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. సతీష్‌ కార్లు కొని అద్దెకు ఇవ్వడం, అమ్మడం చేశాడు. అదీ కలిసిరాక వస్త్ర వ్యాపారం ప్రారంభించినా ఫలితం కనిపించలేదు. ఆయా వ్యాపారాలు చేయడానికి రూ.లక్షల్లో అప్పులు చేశారు. వీటిని ఎలా తీర్చాలో తెలియక ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని