పరిధి తేలక.. వెలికి తీయక.. ఏట్లో నానుతున్న మృతదేహం

పంతొమ్మిదేళ్ల కొడుకు కనిపించకుండాపోయాడు.. ఆవేదనతో పోలీసులకు ఫిర్యాదుచేశారు.. కృష్ణా జలాల్లో ఓ మృతదేహం తేలుతోంది.. మీ వాడేనేమో చూడండని చెప్పారు.. కన్నవారు, కుటుంబ సభ్యులు ఆందోళనతో అక్కడకు చేరుకున్నారు.

Published : 25 Nov 2022 04:04 IST

నందికొట్కూరు, న్యూస్‌టుడే: పంతొమ్మిదేళ్ల కొడుకు కనిపించకుండాపోయాడు.. ఆవేదనతో పోలీసులకు ఫిర్యాదుచేశారు.. కృష్ణా జలాల్లో ఓ మృతదేహం తేలుతోంది.. మీ వాడేనేమో చూడండని చెప్పారు.. కన్నవారు, కుటుంబ సభ్యులు ఆందోళనతో అక్కడకు చేరుకున్నారు. తీరా చూస్తే మృతదేహం నీటిలో బోర్లాపడి తేలుతూ ఉంది. ఇంట్లో అయితే కొడుకును భుజం పట్టుకుని తిప్పి చూసేవారేమో! కానీ ఇంట్లో కాదు.. ఏట్లో ఉన్నాడు! అది కూడా శవమై తేలాడు!! పోలీసులు తప్ప అన్యులెవరూ ముట్టడానికి వీల్లేని పరిస్థితి. పోలీసులు మాత్రం తమ పరిధి కాదంటే తమది కాదంటూ వంతులాడుకుంటున్నారు.. దీంతో కన్నవారి ఆవేదన వర్ణనాతీతం! ఈ దారుణ ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలుకు చెందిన డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి ఒకరు ఈనెల 21 సాయంత్రం నుంచి కనిపించడం లేదని 23న తల్లిదండ్రులు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోతిరెడ్డిపాడు వద్ద గుర్తు తెలియని శవం ఉందని చూడమని సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ మూడో గేటు వద్ద నీటిపై తేలిన ఆ యువకుడి మృతదేహంపై నీలి రంగు చొక్కా ఉంది. అప్పటికే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సమీపంలోని పాములపాడు స్టేషన్‌ సిబ్బంది వచ్చి చూసి ఇది జూపాడు బంగ్లా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తుందని చెప్పి వెళ్లిపోయారు. వాళ్లొచ్చి పాములపాడు ఠాణాకే చెందుతుందని చెప్పారు. ఇలా ఒకరిపై ఒకరు వంతులేసుకుని మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోవడమేంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వెలికి తీయించి ఉంటే ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆందోళనకు తెరపడేది. కొడుకు కనిపించడంలేదని కొంత.. చనిపోయాడేమో అనే బెంగతో మరికొంత వారు ఏటి గట్టుమీద కూర్చుని కుమిలిపోతున్నారు. ఇదీ మన పోలీసుల తీరు!

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని