దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం

విద్యుదాఘాతానికి గురై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కుమారుడిని కాపాడేయత్నంలో తల్లి కూడా చనిపోయారు.

Updated : 25 Nov 2022 06:44 IST

కుమారుడిని కాపాడబోయిన తల్లి

ఇద్దరూ దుర్మరణం
పల్నాడు జిల్లాలో దారుణం

కారంపూడి, న్యూస్‌టుడే: విద్యుదాఘాతానికి గురై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కుమారుడిని కాపాడేయత్నంలో తల్లి కూడా చనిపోయారు. ఈ హృదయ విదారక ఘటన పల్నాడు జిల్లా కారంపూడిలో చోటుచేసుకుంది. అంగడి దేవదానం, నాగమ్మ(60) భార్యాభర్తలు. వీరు తమ కుమారుడు రామకోటేశ్వరరావు(30) అతని భార్య, పిల్లలతో కలిసి ఓ రేకుల ఇంట్లో నివసిస్తున్నారు. రామకోటేశ్వరరావు భార్యాపిల్లలు రెండురోజుల కిందట ఊరెళ్లారు. గురువారం ఉదయం నాగమ్మ దుస్తులు ఉతికారు. తల్లికి సాయం చేయాలనే ఉద్దేశంతో రామకోటేశ్వరరావు వాటిని ఇనుప తీగపై ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు. కిందపడి కొట్టుకుంటున్న కుమారుడిని రక్షించేందుకు నాగమ్మ కర్రతో తీగను పక్కకునెట్టారు. ఆ ప్రయత్నంలో తీగ ఆమెను తాకింది. ఈ ప్రమాదంలో తల్లీకుమారులు అక్కడికక్కడే చనిపోయారు. కొన్నిరోజుల కిందట ఫ్యాన్‌ పాడైతే రామకోటేశ్వరరావు మరమ్మతు చేశారు. ఈ క్రమంలో తీగలను సరిగా కలపకపోయేసరికి పైకప్పుగా ఉన్న రేకులకు, వాటి నుంచి దుస్తులు ఆరేసుకునే ఇనుపతీగకు విద్యుత్తు సరఫరా అయి ఉంటుందని భావిస్తున్నారు. మరోపక్క కూలిపనులకు వెళ్లగా వచ్చిన డబ్బుతో దేవదానం ఉదయాన్నే మద్యంతాగి ఇంటికి వచ్చి పడుకున్నారు. ఓపక్క విద్యుదాఘాతానికి గురై భార్య, కుమారుడు చనిపోయినా జరిగిందేమిటో అర్థంకాక ఆయన మత్తులోనే జోగుతూ కనిపించారు. చుట్టుపక్కల వారు, పోలీసులు... జరిగిన విషయాన్ని దేవదానానికి చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పుట్టింటికి వెళ్లిన మృతుడి భార్య కుమారికి సమాచారమిచ్చిన పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts