మాదక ద్రవ్యాల కింగ్‌పిన్‌ బాలమురుగన్‌ అరెస్టు

అయిదు రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల దందా కొనసాగిస్తున్న డ్రగ్‌ కింగ్‌పిన్‌ బాలమురుగన్‌(48)ను హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌(హెచ్‌న్యూ), రాంగోపాల్‌పేట్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Published : 26 Nov 2022 06:13 IST

రెస్టారెంట్స్‌ ముసుగులో డ్రగ్స్‌ దందా

ఈనాడు, హైదరాబాద్‌- రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: అయిదు రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల దందా కొనసాగిస్తున్న డ్రగ్‌ కింగ్‌పిన్‌ బాలమురుగన్‌(48)ను హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌(హెచ్‌న్యూ), రాంగోపాల్‌పేట్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. గోవా కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో మత్తుపదార్థాల వ్యాపారం చేస్తున్న ఎడ్విన్‌న్యూన్స్‌కు బాలమురుగన్‌ ప్రధాన అనుచరుడు. ఇప్పటివరకు చిక్కకుండా వ్యాపారం సాగించిన న్యూన్స్‌ను హెచ్‌న్యూ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అతడి నుంచి రాబట్టిన సమాచారంతో  గోవాలో తలదాచుకున్నట్టు గుర్తించి బాలమురుగన్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. 15 ఏళ్లుగా ఎడ్విన్‌తో కలిసి వేల మందికి మాదకద్రవ్యాలు చేరవేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

గంజాయి ఇచ్చి.. సింథటిక్‌ డ్రగ్స్‌

తమిళనాడుకు చెందిన బాలమురుగన్‌ రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, గోవా తదితర పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలు విక్రయించేవాడు. గోవాలో న్యూన్స్‌ కూడా హోటళ్లు నిర్వహిస్తుండటంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. మురుగన్‌ హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి గంజాయి, హాష్‌ ఆయిల్‌ తీసుకొచ్చి న్యూన్స్‌కు అందజేసేవాడు. దానికి ప్రతిఫలంగా అతడి నుంచి కొకైన్‌, హెరాయిన్‌, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ వంటి సింథటిక్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడు. ఇద్దరూ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించారు. బాలమురుగన్‌ జాబితాలో పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు సహా 2000 మంది కొనుగోలుదారులున్నట్టు సమాచారం. 2015లో గంజాయి విక్రయిస్తుండగా రాజస్థాన్‌ పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. దీంతో అక్కడి నుంచి మకాం హిమాచల్‌ ప్రదేశ్‌కు మార్చాడు. అక్కడ ధర్మశాల పేరుతో హోటల్‌ ప్రారంభించి దందా మొదలుపెట్టాడు. గోవాలో గరంమసాలా హోటల్‌ ప్రారంభించాడు. ఎడ్విన్‌న్యూన్స్‌ అండదండలతో డ్రగ్స్‌ కింగ్‌పిన్‌గా ఎదిగాడు.తాజాగా హెచ్‌న్యూ పోలీసులకు చిక్కాడు. ఇతడి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టు తెలిసింది. నగర సీపీ సీవీఆనంద్‌ పర్యవేక్షణలో మత్తుముఠాలకు కళ్లెం వేసే వేటను పోలీసులు కొనసాగిస్తున్నారు. కొద్దిరోజులుగా గోవాలో మకాం వేసిన వారు సూత్రధారుల గుట్టురట్టు చేస్తున్నారు. ప్రస్తుతం రెండు పోలీసు బృందాలు దిల్లీ, ముంబయిల్లో ఉన్నట్టు సమాచారం.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు