పెయింటర్‌ను బంధించిన వైకాపా నేత

నూతన గృహానికి రంగులు సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకున్న పెయింటింగ్‌ సంస్థ సేల్స్‌ అధికారిని వైకాపా నేత రోజంతా గదిలో బంధించిన ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో కలకలం సృష్టించింది.

Updated : 26 Nov 2022 06:28 IST

పెందుర్తిలో మరో అకృత్యం వెలుగులోకి

పెందుర్తి, న్యూస్‌టుడే: నూతన గృహానికి రంగులు సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకున్న పెయింటింగ్‌ సంస్థ సేల్స్‌ అధికారిని వైకాపా నేత రోజంతా గదిలో బంధించిన ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో కలకలం సృష్టించింది. దీనికి సంబంధించి సీఐ గొలగాని అప్పారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ గ్రామీణ జిల్లా వైకాపా మాజీ అధ్యక్షుడు శరగడం చిన్న అప్పలనాయుడు పెందుర్తిలోని ఎల్‌ఐసీ కాలనీలో ఇంటిని నిర్మిస్తున్నారు. దానికి రంగులు వేసేందుకు ఓ పెయింటింగ్‌ సంస్థలో సేల్స్‌ అధికారిగా పని చేస్తున్న సాగి లలిత్‌ సుబ్రహ్మణ్యవర్మ(28)తో ఒప్పందం చేసుకున్నారు. మూడు నెలలుగా పనులు జరుగుతున్నాయి. గురువారం ఉదయం పనిని పర్యవేక్షించేందుకు సుబ్రహ్మణ్య వర్మ వెళ్లారు. అయితే చిన్నఅప్పలనాయుడు ఆ కంపెనీ రంగులు కాకుండా మరో సంస్థకు చెందినవి వాడాలని వర్మను కోరారు. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో ఆగ్రహానికి గురైన చిన్న అప్పలనాయుడు అతడి సెల్‌ఫోన్‌, బ్యాగు, ద్విచక్ర వాహనం తాళాలను లాక్కొని మహేశ్‌, మరో ఇద్దరి సాయంతో వర్మను ఓ గదిలో నిర్బంధించారు. రాత్రంతా వర్మ ఇంటికి వెళ్లకపోవడంతో అతడి తల్లి శుక్రవారం ఉదయం చిన్న అప్పలనాయుడి నివాసానికి వెళ్లి అక్కడ ఇంటి ఆవరణలో తన కుమారుడి ద్విచక్ర వాహనాన్ని గుర్తించి అతని గురించి అడిగారు. తనకు తెలియదని ఆయన చెప్పడంతో ఆమె గొడవపడింది. ఇంతలో వర్మ తనను నిర్బంధించిన గది నుంచి తల్లిని చూసి కేకలు వేశారు. ఇది ఆమె గమనించి కుమారుడిని పంపాలని కోరింది. సాయంత్రం పంపిస్తానని చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. దీంతో వర్మను విడిచిపెట్టారు. ఈ మేరకు బాధితుడు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. దీంతో శరగడం చిన్న అప్పలనాయుడు, మహేశ్‌, మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. అయితే ఇంటికి పెయింటింగ్‌ వేసే పనులకు సంబంధించి రెండు కంపెనీల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని చిన్న అప్పలనాయుడు తెలిపారు. వర్మతో తనకు సంబంధం లేదన్నారు. ప్రత్యర్థులు తనపై తప్పుడు ఫిర్యాదు చేయించారని చెప్పారు. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు తెలుస్తాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని