త్వరలోనే శుభవార్త చెబుతానని...

శ్రద్ధా వాకర్‌ హత్యకేసులో తవ్వినకొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెబుతానంటూ ఆమె తన స్నేహితులతో అంటుండేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Updated : 26 Nov 2022 09:18 IST

అంతలోనే హత్యకు గురైంది
శ్రద్ధా వాకర్‌ కేసులో మరో ట్విస్ట్‌

ముంబయి, దిల్లీ: శ్రద్ధా వాకర్‌ హత్యకేసులో తవ్వినకొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెబుతానంటూ ఆమె తన స్నేహితులతో అంటుండేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఆ ‘గుడ్‌న్యూస్‌’ ఏమిటన్నది ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మరోవైపు- శ్రద్ధా గత నవంబరులో ఎనిమిది సార్లు టూత్‌ సెట్టింగ్‌ చికిత్స చేయించుకున్నట్టు తెలిసింది. ఆమెకు చికిత్స అందించిన మహారాష్ట్రలోని వసయికి చెందిన దంత వైద్యుడి నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదుచేశారు. దంతాలకు సంబంధించిన ఎక్స్‌రే, క్రెడిట్‌ కార్డు లావాదేవీల రికార్డులను సేకరించారు. ఇదివరకు లభించిన దవడ భాగంతో ఈ ఎక్స్‌రే సరిపోలితే... కీలక ఆధారం లభ్యమైనట్టేనని భావిస్తున్నారు. శ్రద్ధాను ఆమె ప్రియుడైన ఆఫ్తాబ్‌ దిల్లీలో హత్యచేసిన సంగతి తెలిసిందే. అనంతరం అతడు మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి, అటవీ ప్రాంతాల్లో పారేయడంతో ఈ కేసు దర్యాప్తు ఆసక్తి రేకెత్తిస్తోంది.

సూట్‌కేసులో శరీర భాగాలు.. శ్రద్ధావేనా?

హరియాణాలోని ఫరీదాబాద్‌ సూరజ్‌కుండ్‌ అటవీ ప్రాంతంలో గురువారం లభ్యమైన సూట్‌ కేసులో కొన్ని శరీరభాగాలు ఉన్నాయి! ఇవి శ్రద్ధావే కావచ్చని భావిస్తున్నారు. అక్కడకు వెళ్లిన దిల్లీ పోలీసులు.. ఇవి మహిళవా? పురుషుడివా? అన్న విషయాలను తెలుసుకునేందుకు డీఎన్‌ఏ తదితర పరీక్షలు చేయిస్తున్నట్టు వెల్లడించారు. శ్రద్ధా ఫోన్‌ కోసం దిల్లీ, ముంబయి పోలీసులు వసయి ప్రాంతంలో ముమ్మరంగా గాలిస్తున్నారు. భయందర్‌ తీర ప్రాంతంలో పడవల సాయంతో వెతుకుతున్నారు.

క్షణికావేశం కాదు.. పక్కా ప్రణాళికతోనే!

ఆఫ్తాబ్‌ పక్కా ప్రణాళికతోనే శ్రద్ధాను చంపేశాడని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. పోలీసులకు ఎలాంటి ఆధారాలూ లభ్యం కాకూడదన్న ఉద్దేశంతో అతడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాడని.. అందుకే హత్య చేసేటప్పుడు, శరీర భాగాలను పారేసేటప్పుడు ఫోన్‌ను వినియోగించలేదని పేర్కొన్నారు. నిందితుడికి పాలిగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించడం ద్వారా పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. శుక్రవారంతో పాలిగ్రాఫ్‌ పరీక్ష దశలన్నీ పూర్తయ్యాయని, దీనిపై వచ్చే నివేదికను బట్టి నార్కో ఎనాలసిస్‌ పరీక్ష నిర్వహించే విషయమై నిర్ణయం తీసుకుంటామని ఫోరెన్సిక్‌ అధికారులు తెలిపారు. కాగా, ఆఫ్తాబ్‌ ఇంటి నుంచి అయిదు కత్తులను, అతడు ఛత్రపుర్‌ ప్రాంతంలో తిరుగుతున్న దృశ్యాలు నమోదైన మూడు సీసీటీవీ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. సహజీవనం చేస్తున్న సమయంలో ఆఫ్తాబ్‌ సిగరెట్‌తో శ్రద్ధా వీపుపై కాల్చేవాడని, కలిసి ఉండాలన్న ఉద్దేశంతోనే వాటిని భరించిందని ఆమె స్నేహితులు వెల్లడించారు.


ప్రేమించేవారు ముక్కలు చేస్తారా: స్మృతి ఇరానీ

శ్రద్ధా హత్యోదంతంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. తెలిసినవారు, భాగస్వాముల వల్ల మహిళలపై జరుగుతున్న హింస విషయమై చర్చ జరగాలన్నారు. ‘‘ఎంతటి ఆవేశం వచ్చినా ఒక మహిళను ఎవరూ ముక్కలు చేయరు. ప్రేమిస్తున్నవారు హింసకు పాల్పడలేరు. శ్రద్ధాపై వేధింపులు కొంతకాలం పాటూ కొనసాగాయి. ఈ విషయం చాలామందికి తెలుసు. చదువుతో సంబంధం లేకుండా గృహహింస చోటుచేసుకుంటోంది. ఆప్‌ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు జైలులో అత్యాచార నిందితుడు మసాజ్‌ చేస్తున్న వీడియో నన్ను నిర్ఘాంతపరచింది. ఈ వీడియోలు చూసిన తర్వాత కేజ్రీవాల్‌ నోట మాటలు రావడంలేదేమో’’ అని ఆమె పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు