రాళ్లు, రాడ్లతో వచ్చి విధ్వంసం

కేరళలోని తిరువనంతపురం జిల్లా విళింజం పోలీసు స్టేషన్‌పై ఆదివారం రాత్రి జరిగిన దాడికి సంబంధించి 3 వేలమందికి పైగా నిరసనకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 29 Nov 2022 04:40 IST

విళింజం స్టేషన్‌పై దాడిలో 40 మంది పోలీసులకు గాయాలు
ఈ ఘటనలో 3 వేలమందిపై కేసు
నిందితుల్లో మహిళలు, చిన్నారులు

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం జిల్లా విళింజం పోలీసు స్టేషన్‌పై ఆదివారం రాత్రి జరిగిన దాడికి సంబంధించి 3 వేలమందికి పైగా నిరసనకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. చట్టవిరుద్ధంగా గుమిగూడటం, అల్లర్లు, నేరపూరిత కుట్రకు పాల్పడటం వంటి అభియోగాలను నిందితులపై మోపారు. విళింజంలో అదానీ గ్రూపు నిర్మిస్తున్న ఓడరేవును వ్యతిరేకిస్తూ శనివారం జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. అక్కడ ఓ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.. మరికొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారందర్నీ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ విళింజం పోలీసు స్టేషన్‌పై నిరసనకారులు దాడి చేశారు. ఈ ఘటనలో దాదాపు 40 మంది పోలీసులతో పాటు పలువురు స్థానికులు గాయపడ్డారు.

పోలీసుల కథనం ప్రకారం.. నిరసనకారులు ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇనుపరాడ్లు, రాళ్లు, కర్రలతో పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకొని భయానక వాతావరణం సృష్టించారు. తమవాళ్లను విడుదల చేయకపోతే స్టేషన్‌కు నిప్పంటిస్తామని హెచ్చరించారు. ఆపై హింసాత్మక దాడులకు పాల్పడ్డారు. ఐదు పోలీసు వాహనాలు సహా స్టేషన్‌లోని విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. ఆస్తి నష్టం విలువ దాదాపు రూ.85 లక్షల వరకు ఉంటుందని అంచనా. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో తిరువనంతపురం వ్యాప్తంగా ప్రత్యేక బలగాలను మోహరించినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు 90 కోట్ల డాలర్ల పెట్టుబడితో అదానీ సంస్థ విళింజంలో పోర్టు నిర్మాణం చేపడుతోంది. దీనివల్ల తమ జీవనోపాధికి విఘాతం కలుగుతుందని స్థానిక మత్యకారులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మతపెద్దలపై ఎఫ్‌ఐఆర్‌

విళింజం ఓడరేవు వ్యతిరేక ఆందోళనలకు స్థానిక చర్చివర్గాలు ఆజ్యం పోస్తున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆర్చ్‌బిషప్‌ థామస్‌ జె నెట్టో, వికార్‌ జనరల్‌ యుజీన్‌ పెరీరా సహా 15 మంది లాటిన్‌ క్యాథలిక్‌ చర్చి ఫాదర్‌లపై పోలీసులు ఆదివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తమపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని లాటిన్‌ క్యాథలిక్‌ చర్చివర్గాలు స్పష్టం చేశాయి. దీనిపై జ్యుడీషియల్‌ దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశాయి. మరోవైపు- తాజా హింసాత్మక నిరసనలతో జరిగిన ఆస్తి నష్టాన్ని ఆందోళనకారుల నుంచే వసూలు చేసేలా చర్యలు తీసుకుంటామని కేరళ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నివేదించింది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు