Hyderabad: తోటి విద్యార్థులే తోడేళ్లు

రాజధాని శివారులో దారుణం వెలుగుచూసింది. పదో తరగతి చదువుతున్న బాలికపై అదే పాఠశాలలోని తోటి విద్యార్థులు నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పుస్తకం కావాలంటూ బాధితురాలి ఇంటికెళ్లిన నిందితులు తల్లిదండ్రులు లేని సమయం చూసుకుని బెదిరించి దురాగతానికి పాల్పడ్డారు.

Updated : 30 Nov 2022 09:05 IST

17 ఏళ్ల బాలికపై నలుగురు విద్యార్థుల సామూహిక అత్యాచారం
పుస్తకం కోసమంటూ ఇంటికెళ్లి బెదిరించి ఘాతుకం
ఘటన సెల్‌ఫోన్లో చిత్రీకరణ.. దాన్ని చూపి మరొకడి వేధింపులు
హయత్‌నగర్‌లో దారుణం
మూడు నెలల తర్వాత వెలుగులోకి

ఈనాడు- హైదరాబాద్‌, హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: రాజధాని శివారులో దారుణం వెలుగుచూసింది. పదో తరగతి చదువుతున్న బాలికపై అదే పాఠశాలలోని తోటి విద్యార్థులు నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పుస్తకం కావాలంటూ బాధితురాలి ఇంటికెళ్లిన నిందితులు తల్లిదండ్రులు లేని సమయం చూసుకుని బెదిరించి దురాగతానికి పాల్పడ్డారు. ఈ కిరాతకాన్ని ఒకడు సెల్‌ఫోన్లో చిత్రీకరించాడు. ఈ వీడియోను చూసిన మరొకడు.. దాన్ని చూపి బాలికను లైంగికంగా వేధించాడు. తన దగ్గరున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు పంపాడు. ఈ ఘోరాన్ని బాలిక తల్లిదండ్రులకు వివరించడంతో వారు హయత్‌నగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పరిధిలో ఆగస్టులో జరిగిన ఈ దురాగతం తాజాగా వెలుగులోకి వచ్చింది. మైనర్లయిన నిందితులపై పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని మంగళవారం జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు ముందు  హాజరుపరిచారు.

అశ్లీల చిత్రాలతో అడ్డదారి..

హయత్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని పాఠశాలలో బాలిక(17) పదో తరగతి చదువుతోంది. అందులోనే నలుగురు విద్యార్థులు పదో తరగతి, ఒకరు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. అంతా ఇరుగూపొరుగునే ఉంటున్నారు. ఈ ఐదుగురూ పాఠశాల ముగియగానే నిత్యం సెల్‌ఫోన్లలో అశ్లీల చిత్రాలు చూడడం అలవాటు చేసుకున్నారు. అప్పుడప్పుడూ నగర శివారు ప్రాంతాలకు వెళ్లి ఇష్టారాజ్యంగా తిరిగేవారు. ఈ నేపథ్యంలో తమతో పాటు చదివే బాలికపై కన్నేశారు. ఒకే స్కూల్‌లో చదివేవారు కావడంతో బాలిక వారితో కొంచెం చనువుగా ఉండేది. దీన్ని అవకాశంగా తీసుకున్న నలుగురు.. గత ఆగస్టు 17న పుస్తకం కావాలంటూ తల్లిదండ్రులు లేని సమయం చూసుకుని ఆమె ఇంటికెళ్లారు. బాలిక ఒక్కతే ఉండడంతో భయపెట్టి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దురాగతాన్నంతా వారిలో ఒకరు సెల్‌ఫోన్లో చిత్రీకరించాడు. వారి బెదిరింపులతో భయపడ్డ బాలిక విషయాన్ని ఇతరులతో చెప్పలేదు.

లైంగిక వేధింపుల పరంపర

బాధితురాలు ఘోరాన్ని ఎవ్వరికీ చెప్పకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న నిందితులు ఆమెపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డట్లు విశ్వసనీయ సమాచారం. అనంతరం సామూహిక అత్యాచార వీడియోను నిందితుల్లో ఒకరు తన స్నేహితుడికి చూపించాడు. సదరు బాలుడు వీడియోను బాధితురాలికి చూపించి తనకు సహకరించాలని, లేకుంటే సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. బాధితురాలి తల్లిదండ్రులు లేని సమయంలో మరోసారి ఆమె ఇంటికెళ్లి లైంగికంగా వేధించాడు. బాలిక అంగీకరించకపోవడంతో తన దగ్గరున్న వీడియోను ఓ సామాజిక మాధ్యమం ద్వారా ఇతరులకు పంపించాడు. వరస దారుణాలను తట్టుకోలేకపోయిన బాలిక తనపై జరిగిన అకృత్యాలను తల్లిదండ్రులకు వివరించింది. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హయత్‌నగర్‌ పోలీసులు ఐదుగురు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి చర్యల నిమిత్తం జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు ముందుంచారు.

రాజీకి పెద్దల యత్నం!

దారుణానికి సంబంధించిన వీడియో వెలుగుచూసిన నేపథ్యంలో బాధితురాలు, నిందితుల తల్లిదండ్రుల మధ్య రాజీ కుదిర్చేందుకు స్థానిక పెద్దలు ప్రయత్నించినట్లు తెలిసింది. మరోవైపు బాలికపై సామూహిక అత్యాచారానికి సంబంధించిన వీడియోను నిందితులు ఇతరులకు షేర్‌ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో అశ్లీల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తే పోక్సో, జువెనైల్‌ జస్టిస్‌ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఘటనకు సంబంధించిన వీడియో షేర్‌ చేసినట్లు ప్రజల దృష్టికి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని