వాహనంతో తొక్కించి సోదరుడి హత్య

నాలుగు చక్రాల ట్రాలీ ఆటోతో తొక్కించి సొంత అన్నను తమ్ముడే హత్య చేశాడు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది.

Published : 01 Dec 2022 04:52 IST

మర్పల్లి, న్యూస్‌టుడే: నాలుగు చక్రాల ట్రాలీ ఆటోతో తొక్కించి సొంత అన్నను తమ్ముడే హత్య చేశాడు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జెంషద్‌పూర్‌ గ్రామానికి చెందిన మ్యాతరి భాగమ్మకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ఏడాది కిందట చనిపోగా రెండో కుమారుడు అశోక్‌ (45)కు భార్య చంద్రకళ, ఇద్దరు కుమారులున్నారు. మనస్పర్థలతో ఆరేళ్లుగా అశోక్‌ భార్యకు దూరంగా నగరంలో కూలీ పనిచేసుకుంటున్నాడు. ఏడాది కిందట మళ్లీ గ్రామానికి వచ్చి.. తల్లి వద్ద ఉంటున్నాడు. తమ్ముడు యాదయ్యతో అశోక్‌ తరచూ గొడవ పడేవాడు. మంగళవారం సాయంత్రం సమయంలో తల్లికి ఆరోగ్యం బాగాలేదని తెలియడంతో పట్లూర్‌లో ఉన్న కూతురు, అల్లుడు వచ్చారు. ఈ సందర్భంగా అన్నదమ్ములిద్దరూ దూషించుకున్నారు. మాటమాట పెరగడంతో ‘నిన్ను చంపేస్తా’ అని ఆవేశంతో యాదయ్య అన్నాడు. దీంతో ఇంటిముందున్న యాదయ్య ట్రాలీ ఆటోకు అడ్డంగా అశోక్‌ నిలబడ్డాడు. ఆవేశంతో యాదయ్య ట్రాలీ అటోను అన్నపై నుంచి రెండుసార్లు ఎక్కించాడు. దీంతో అతని కుడి కాలు విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు తరలించారు. తర్వాత నగరంలోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 12 గంటల సమయంలో అశోక్‌ మృతి చెందాడు. మృతుడి తల్లి భాగమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. నిందితుడు యాదయ్యతో తమకు ప్రాణహాని ఉందని మృతుడి భార్య చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు