సంక్షిప్త వార్తలు(5)

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బాలాఘాట్‌ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.

Updated : 01 Dec 2022 05:46 IST

మధ్యప్రదేశ్‌లో ఇద్దరు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బాలాఘాట్‌ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో వీరిద్దరి తలలపై రూ.43 లక్షల రివార్డు, 33 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు ఎలైట్‌ హాక్‌ ఫోర్సుకు చెందిన స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ) పాల్గొన్న ఈ ఎన్‌కౌంటరు సూప్‌ఖార్‌ అటవీ ప్రాంతంలో జరిగినట్లు నక్సల్స్‌ వ్యతిరేక కార్యకలాపాల ఐజీ సాజిద్‌ ఫరీద్‌ శాపూ తెలిపారు. మృతులను మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన ‘ఎంఎంసీ జోన్‌’ కోఆర్డినేషన్‌ టీం ఇన్‌ఛార్జి గణేశ్‌ మాధవి (35), ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చెందిన భోరందేవ్‌ ఏరియా కమిటీ కమాండర్‌ రాజేశ్‌ (30)లుగా గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి ఏకే-47తోపాటు రెండు ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నట్లు ఐజీ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టుల కదలికల గురించి సమాచారం అందడంతో గాలింపు చేపట్టామని, ముందుగా వారి వైపు నుంచే కాల్పులు మొదలైనట్లు వివరించారు. డిసెంబరు 2 - 8 తేదీల మధ్య ‘పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ’ (పీఎల్‌జీఏ) వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మావోయిస్టులు కరపత్రాలు కూడా పంచినట్లు తెలిపారు.


గుజరాత్‌లో రూ.479 కోట్ల  మెఫెడ్రోన్‌, ముడిపదార్థం స్వాధీనం

అహ్మదాబాద్‌: నిషేధిత మాదకద్రవ్యం మెఫెడ్రోన్‌, దాని ముడిపదార్థం గుజరాత్‌లో భారీగా పట్టుబడింది. వాటి విలువ సుమారు రూ.478.65 కోట్లుగా అంచనా. వడోదర శివారుల్లోని ఓ తయారీ కర్మాగారంపై గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్‌) జరిపిన దాడిలో ఈ మత్తుపదార్థాలు దొరికాయి. ఈ మేరకు ఏటీఎస్‌ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. వడోదర జిల్లాలోని సింధ్‌రాట్‌ గ్రామ సమీపంలోని చిన్న ఫ్యాక్టరీ-గోదాముపై మంగళవారం రాత్రి ఏటీఎస్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 63.6 కేజీల మెఫెడ్రోన్‌, 80.26 కేజీల ముడిపదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఎండీ డ్రగ్‌ వ్యవహరించే మెఫెడ్రోన్‌ను 45 రోజులుగా తయారు చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు ఏటీఎస్‌ అధికార ప్రకటనలో తెలిపింది.


ఒకే కుటుంబంలోని ఆరుగురు అగ్నికి ఆహుతి
మృతుల్లో ముగ్గురు చిన్నారులు

ఫిరోజాబాద్‌ (యూపీ): ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వీరు నివసిస్తున్న భవనం కింది అంతస్తులో ఉన్న ఎలక్ట్రానిక్స్‌ - ఫర్నీచర్‌ దుకాణంలో రాత్రివేళ మంటలు రాజుకొన్నాయి. ఇంటి యజమాని మనోజ్‌, నీరజ్‌ దంపతులతోపాటు వీరి పిల్లలు భరత్‌, హర్షవర్ధన్‌.. మనోజ్‌ సోదరుడి భార్య శివాని, వీరి ఆరునెలల కుమార్తె తేజస్వి మంటల్లో ఆహుతి అయినట్లు జిల్లా మేజిస్ట్రేట్‌ రవి రంజన్‌ బుధవారం వివరించారు. దుకాణంలోని బ్యాటరీ పేలి రాజుకొన్న మంటలు భవనంలోని రెండు, మూడు అంతస్తులకు వ్యాపించాయి. దుకాణం యజమాని రమణ్‌ రాజ్‌పుత్‌, ఈయన కుమారుడు నితిన్‌, మనోజ్‌ కుమార్తె ఉన్నతి ప్రమాదం నుంచి బయటపడ్డారు.  


యూపీలో బస్సును ఢీకొన్న ట్రక్కు.. ఆరుగురి మృతి

బహరాయిచ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ - బహరాయిచ్‌ హైవేపై బుధవారం వేగంగా దూసుకువచ్చిన ఓ ట్రక్కు .. లఖ్‌నవూ డిపో బస్సును ఢీకొనడంతో ఆరుగురు మృతిచెందగా, 15 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో జరవల్‌ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు జిల్లా మేజిస్ట్రేట్‌ దినేశ్‌చంద్ర సింగ్‌ వెల్లడించారు. ట్రక్కు డ్రైవరు పరారీలో ఉన్నాడు.


పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీకొట్టి..

పశ్చిమబెంగాల్‌లోని సియాల్దా సమీపంలో బుధవారం ఉదయం రాణాఘాట్‌ లోకల్‌ రైలు పట్టాలు తప్పి.. మరో లోకల్‌ ట్రైన్‌ను ఢీకొట్టింది. లోకోపైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఘటన జరిగిన వెంటనే రైలులోని ప్రయాణికులను దించేశారు. వారంతా రైల్వే లైన్‌ వెంట నడిచి ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్నారు. ప్రమాదం దృష్ట్యా అధికారులు ఆ మార్గంలో రైలు రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు. సిగ్నలింగ్‌లో గందరగోళమే ప్రమాదానికి దారితీసిందని భావిస్తున్నారు. అసలు కారణమేంటో తేల్చేందుకు దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు