చంద్రగిరిలో పరువు హత్య

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీలో జులైౖలో జరిగిన విద్యార్థిని ఆత్మహత్య కేసు సంచలనంగా మారింది.

Published : 03 Dec 2022 04:14 IST

యువతి గొంతు నులిమి హతమార్చిన కుటుంబసభ్యులు
పోస్టుమార్టం నివేదికతో ఆలస్యంగా వెలుగులోకి

చంద్రగిరి, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీలో జులైౖలో జరిగిన విద్యార్థిని ఆత్మహత్య కేసు సంచలనంగా మారింది. ఐదు నెలల తర్వాత వచ్చిన పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు దీన్ని హత్యగా నిర్ధారించారు. విషయం తెలియడంతో యువతి హత్యకు పాల్పడిన కుటుంబసభ్యులు పరారయ్యారు. పోలీసుల కథనం మేరకు... చంద్రగిరికి చెందిన మునిరాజ కుమార్తె మోహనకృష్ణ(19) రెడ్డివారిపల్లి పంచాయతీ ఎస్‌ఎల్‌నగర్‌లోని తన మేనమామ బాలకృష్ణ ఇంట్లో ఉంటూ దూరవిద్యలో ఇంటర్‌ చదువుతోంది. రామిరెడ్డిపల్లి పంచాయతీ ఆంజనేయపురానికి చెందిన యువకుడు వికాస్‌తో అయిదేళ్లు ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి కులాలు వేరుకావడంతో యువతి ఇంటి వారు పెళ్లికి అంగీకరించలేదు. ఓ దశలో రెండు కుటుంబాల మధ్య పెళ్లి చర్చలు జరిగాయి. అమ్మాయి తరఫు వారు ఇష్టపడకపోవడంతో 2022 జులై 1న వారిద్దరూ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయారు. అప్పట్లో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. వారి సాయంతో కుటుంబసభ్యులు ప్రేమజంటను పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేశారు. ప్రియుడి నుంచి తనను దూరం చేశారనే మనస్తాపానికి గురై జులై 7న ఉదయం యువతి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అప్పట్లోనే ఎస్‌ఎల్‌నగర్‌ గ్రామస్థులు అది ఆత్మహత్య కాదని.. కుటుంబసభ్యులే హత్యచేసి ఉంటారని ఆరోపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వంశీధర్‌ ఆత్మహత్య కేసుగా నమోదుచేసి శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు.

ఇన్నాళ్లకు వీడిన రహస్యం

మోహనకృష్ణ పోస్టుమార్టం రిపోర్టు నివేదిక గురువారం వెలువడింది. అందులో యువతి ఉరివేసుకుని మృతిచెందినట్లు లేదని.. బలవంతంగా గొంతు నులిమి చంపేశారని తేలింది. డీఎస్పీ నరసప్ప, స్థానిక పోలీసు అధికారులతో కలిసి ఎల్‌ఎస్‌ నగర్‌లోని యువతి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఇంటికి తాళాలు వేసి ఉండటంతో పోలీసులు యువతి కుటుంబసభ్యుల కోసం గాలిస్తున్నారు. హత్య కేసుగా పరిగణనలోకి తీసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని