క్వారీ కూలి ఏడుగురు ఆదివాసీ కూలీల దుర్మరణం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ జిల్లా మాల్గావ్‌ ప్రాంతంలో క్వారీ కూలిపోయి ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు.

Published : 03 Dec 2022 04:14 IST

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం
చనిపోయిన వారిలో  ఆరుగురు మహిళలే..

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ జిల్లా మాల్గావ్‌ ప్రాంతంలో క్వారీ కూలిపోయి ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు. చనిపోయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాల్గావ్‌ గ్రామానికి చెందిన ఎనిమిది మంది కూలీలు గ్రామశివారులోని ప్రభుత్వ క్వారీల్లో మట్టి తవ్వకాల పనులకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో పనులు చేస్తున్న వారిపై ఒక్కసారిగా మట్టిచరియలు విరిగిపడ్డాయి. దీంతో మట్టిలో కూరుకుపోయి ఆరుగురు మహిళలతోపాటు మరో కూలి అక్కడికక్కడే మృతి చెందారు. పువానీ అనే పన్నెండేళ్ల బాలిక తీవ్రగాయాలపాలైంది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను హుటాహుటిన డిమ్రాపాల్‌ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మట్టిచరియల కింద ఉన్న మృతదేహాలను పొక్లెయినర్ల సాయంతో వెలికితీశారు. మృతులు రామేశ్వర్‌ బహోల్‌ (35), కమలీ (25), శాంతి (35), ఉమారీ (25), ధరామతీ (35), మన్మతి (46), అమాడీ ఈశ్వర్‌ (25)గా గుర్తించారు. ఒకేసారి ఏడుగురి మృతితో ఆదివాసీల కుటుంబాల్లో విషాదం అలుముకుంది. సంఘటన స్థలంలో వారు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు చూపరులను కలిచివేసింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం డిమ్రాపాల్‌ వైద్యశాలకు తరలించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని