రైల్లో కూర్చుంటే.. కిటికీలోంచి మృత్యువొచ్చింది

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమనడానికి ఈ ఘటనే నిదర్శనం.

Published : 03 Dec 2022 04:39 IST

ఇనుపకడ్డీ గుచ్చుకుని దుర్మరణం పాలైన ప్రయాణికుడు

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమనడానికి ఈ ఘటనే నిదర్శనం. రైల్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి కిటికీ అద్దాల నుంచి లోపలకు చొచ్చుకొచ్చిన ఓ ఇనుప కడ్డీ మెడలో గుచ్చుకుని అతడి ప్రాణం పోయిన ఘటన దిల్లీ సమీపంలో చోటు చేసుకుంది. దిల్లీలోని సుల్తాన్‌పుర్‌కు చెందిన హరికేశ్‌ దుబే (34) శుక్రవారం ఉదయం దిల్లీ నుంచి కాన్పూర్‌ వెళ్లే నీలాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కాడు. ప్రయాగ్‌రాజ్‌ డివిజన్‌ పరిధిలోని దన్వర్‌-సోమ్నా స్టేషన్ల మధ్యలో 8.45 నిమిషాలకు ఒక ఇనుప కడ్డీ హఠాత్తుగా బోగీలోకి దూసుకొచ్చి.. హరికేశ్‌ మెడలోకి చొచ్చుకుపోయింది. క్షణాల్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అలీగఢ్‌ జంక్షన్‌లో రైలును ఆపి.. మృతదేహాన్ని రైల్వే పోలీసులకు అప్పగించారు. కొన్ని చోట్ల ట్రాక్‌ను సరిచేసేందుకు ఉపయోగించే ఇనుప కడ్డీ బోగీలోకి దూసుకొచ్చిందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. లఖ్‌నవూలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని దుబే బంధువు తెలిపారు. మృతునికి తల్లిదండ్రులు, భార్య షాలిని, కుమార్తె ఆర్య (7), కుమారుడు ఆయాన్ష్‌ (4) ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని