మా బావ మానసికంగా వేధిస్తున్నారు.. వైకాపా ఎమ్మెల్యే బావమరిది ఆత్మహత్యాయత్నం

‘నా అనుచరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇంటి వద్ద నిఘా పెట్టారు. బారికేడ్లు అమర్చారు. నన్ను మానసికంగా వేధిస్తున్నారు. ఆయన కారణంగా అప్పుల పాలయ్యాను.

Published : 04 Dec 2022 07:58 IST

ఈనాడు, తిరుపతి: ‘నా అనుచరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇంటి వద్ద నిఘా పెట్టారు. బారికేడ్లు అమర్చారు. నన్ను మానసికంగా వేధిస్తున్నారు. ఆయన కారణంగా అప్పుల పాలయ్యాను. ఆయన మా ఇంటికి వస్తే భార్య, ఇద్దరు ఆడపిల్లలతో సహా శ్రీకాళహస్తీశ్వరుని సాక్షిగా ఆత్మహత్య చేసుకుంటాం’ అని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సొంత బావమరిది సామాను శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. ఒంటిపై రక్తమోడుతున్న స్థితిలో పోలీసుల సమక్షంలో ఆయన చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. శ్రీకాళహస్తి మండలం ఎ.ఎం.పుత్తూరు సమీపంలోని ఫాంహౌస్‌లో నివాసముండే శ్రీధర్‌రెడ్డి.. శుక్రవారం అర్ధరాత్రి తన చేతిపై కత్తితో కోసుకున్నారు. పొట్ట, నడుము వద్ద కూడా కత్తిగాట్లున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితులు వైద్యులను పిలిపించి చికిత్స చేయించారు. శనివారం ఈ వార్త బయటకు పొక్కగానే ఆయన అనుచరులు భారీగా ఫాంహౌస్‌కు చేరుకున్నారు. సీఐలు భాస్కర్‌నాయక్‌, విక్రం వచ్చి శ్రీధర్‌రెడ్డిని ఆరా తీసే ప్రయత్నం చేశారు.

ఎమ్మెల్యే నిండా ముంచారంటూ ఆవేదన

సీఐలు మాట్లాడుతుండగానే..‘మమ్మల్ని కాల్చి చంపేయండి. మీకు ప్రమోషన్‌ ఇచ్చి డీఎస్పీలను చేస్తారు. అంతకంటే మీకేం కావాలి’ అంటూ శ్రీధర్‌రెడ్డి ఆగ్రహించారు. గోడపైకి ఎక్కి మెడపై కత్తి పెట్టుకుని పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. కత్తితో మరోసారి గాయం చేసుకున్నారు. ఆ సమయంలో శ్రీధర్‌రెడ్డి భార్య, పిల్లలు భీతిల్లిపోయారు. ఉద్రిక్తత సడలిన తర్వాత శ్రీధర్‌రెడ్డితో డీఎస్పీ విశ్వనాథ్‌ చర్చించారు. తన బావ, ఎమ్మెల్యే మధుపై తీవ్ర విమర్శలు చేశారు. ‘వాళ్లు కూటికి, గుడ్డకు లేకుండా అప్పులపాలైతే నేను సాయం చేశాను. ఆయన కోసం 30 ఎకరాలు అమ్మాను. నేను అప్పులు కట్టకపోతే శ్రీకాళహస్తిలో అడుగుపెట్టేవారు కాదు. రూ.2 కోట్లు కావాలని ఏడిస్తే ఇచ్చాను. ఎమ్మెల్యేగా గెలిచాక నన్ను నమ్మకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చాను. ఏ పార్టీలోనూ చేరలేదు. నాకు ఆస్తి లేకున్నా ఫర్వాలేదు. ఆయన్ను, ఆయన బిడ్డలను గుడికి వచ్చి ఆ ఆస్తి తమదేనని ప్రమాణం చేస్తే నేను వదిలేసి వెళ్లిపోతాను’ అని వాపోయారు. ‘మా ఆయన అనుకుంటే అరగంటలో రౌడీలను పంపించి చంపిస్తాం’ అని బెదిరిస్తోందంటూ తన సోదరి, ఎమ్మెల్యే భార్య శ్రీవాణినుద్దేశించి ఆరోపించారు. శ్రీధర్‌రెడ్డిని పోలీసులు సముదాయించి వెళ్లిపోయారు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. శ్రీధర్‌రెడ్డి 2019 ఎన్నికల వేళ మధుసూదన్‌రెడ్డి విజయానికి కృషి చేశారు. ఎన్నికలయ్యాక బావ, బావమరిది మధ్య విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని