శ్రద్ధా హత్య సాక్ష్యాలు సముద్రం పాలు

సంచలనం సృష్టించిన కాల్‌సెంటర్‌ ఉద్యోగిని శ్రద్ధా వాకర్‌ హత్యకేసులో రోజుకో విషయం బయటకొస్తోంది. ఆమె ఫోనుతోపాటు హత్యకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలను నిందితుడు ఆఫ్తాబ్‌ సముద్రంలోకి విసిరేసినట్లు పోలీసువర్గాలు తాజాగా వెల్లడించాయి.

Published : 04 Dec 2022 04:42 IST

డీఎన్‌ఏ నివేదికే ఇక కీలకం

దిల్లీ: సంచలనం సృష్టించిన కాల్‌సెంటర్‌ ఉద్యోగిని శ్రద్ధా వాకర్‌ హత్యకేసులో రోజుకో విషయం బయటకొస్తోంది. ఆమె ఫోనుతోపాటు హత్యకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలను నిందితుడు ఆఫ్తాబ్‌ సముద్రంలోకి విసిరేసినట్లు పోలీసువర్గాలు తాజాగా వెల్లడించాయి. శ్రద్ధాను చంపిన తర్వాత నిందితుడు ఆమె ఫోను కొన్ని నెలలపాటు తన వద్దే ఉంచుకొన్నట్లు పోలీసులు తెలిపారు. ముంబయిలో పోలీసు విచారణకు వెళ్లినప్పుడు కూడా ఆ ఫోను వెంట తీసుకువెళ్లాడు. మే 18న శ్రద్ధా వాకర్‌ దిల్లీలో దారుణహత్యకు గురికాగా.. ఈ విషయం తెలియని ఆమె తల్లిదండ్రులు అనుమానంతో ముంబయిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నవంబరు 3న ఆఫ్తాబ్‌ను ముంబయికి పిలిచి ప్రశ్నించారు. ఈ విచారణ సమయంలో శ్రద్ధా ఫోను అతడి వద్దే ఉండగా.. ఫోనుతో తాను దొరికిపోతానని భావించిన నిందితుడు ముంబయి నుంచి దిల్లీకి తిరిగివెళ్లే ముందు సముద్రంలోకి దాన్ని విసిరేశాడు. ఇదే విషయం నార్కో పరీక్షలోనూ చెప్పాడు. హత్య జరిగిన కొన్నిరోజుల తర్వాత ముంబయికి వెళ్లిన ఆఫ్తాబ్‌.. శ్రద్ధా తనకు బ్రేకప్‌ చెప్పి వెళ్లిపోయిందని స్నేహితులను నమ్మించే ప్రయత్నం చేశాడు. హత్య చేశాక.. శ్రద్ధా క్రెడిట్‌ కార్డు బిల్లులను ఆమె ఫోనుతోనే నిందితుడు చెల్లించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆఫ్తాబ్‌ పోలీసు కస్టడీలో చెప్పిన విషయాలనే నార్కో, పాలిగ్రాఫ్‌ పరీక్షల్లోనూ చెప్పాడని సమాచారం. దీంతో అతడు ఈ పరీక్షల కోసం ముందుగానే రిహార్సల్‌ చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రద్ధా డీఎన్‌ఏ నివేదిక వస్తే గానీ ఈ కేసు ఓ కొలిక్కివచ్చే అవకాశాలు కనిపించట్లేదు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు