రాజస్థాన్‌లో ఇంటి ముందు గ్యాంగ్‌స్టర్‌ కాల్చివేత

రాజస్థాన్‌లోని సీకర్‌ జిల్లాలో శనివారం పట్టపగలు ఓ గ్యాంగ్‌స్టర్‌ను అతని ఇంటి ముందు ప్రత్యర్థులు కాల్చి చంపారు.

Published : 04 Dec 2022 04:42 IST

బుల్లెట్లు తగిలి మరో వ్యక్తి మృతి

సీకర్‌: రాజస్థాన్‌లోని సీకర్‌ జిల్లాలో శనివారం పట్టపగలు ఓ గ్యాంగ్‌స్టర్‌ను అతని ఇంటి ముందు ప్రత్యర్థులు కాల్చి చంపారు. 30కు పైగా క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా బెయిలు మీద ఉన్న రాజు ఠేఠ్‌ ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. 2017లో పోలీస్‌ ఎన్‌కౌంటరులో మృతిచెందిన నేరగాడు ఆనంద్‌పాల్‌ సింగ్‌ ముఠాతో రాజుకు తగాదాలు ఉన్నాయి. ఉద్యోగ్‌ నగర్‌ పోలీస్‌స్టేషను పరిధిలోని పిప్రాలి రోడ్డులో ఉంటున్న రాజు ఠేఠ్‌ శనివారం తన ఇంటి నుంచి బయటకు వస్తుండగా మెయిన్‌గేటు వద్ద అయిదుగురు దుండగులు అతనిపై కాల్పులు జరిపినట్లు సీకర్‌ ఎస్పీ కున్వర్‌ రాష్ట్రదీప్‌ తెలిపారు. ఈ కాల్పుల సమయంలో అక్కడున్న తారాచంద్‌ అనే మరో వ్యక్తికి సైతం బుల్లెట్లు తగిలి చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ వీధిలో ఉన్న కోచింగ్‌ సెంటర్‌లో చదువుతున్న కుమార్తెను కలిసేందుకు వచ్చిన తారాచంద్‌ను రాజుఠేఠ్‌కు సహాయకుడిగా భావించి పొరపడిన దుండగులు అతడిపై కూడా కాల్పులు జరిపారు. అయిదుగురు నిందితుల్లో నలుగురిని గుర్తించినట్లు డీజీపీ ఉమేశ్‌ మిశ్ర తెలిపారు. కాల్పుల సమయంలో రాజుఠేఠ్‌ ఇంటి ముందు ట్రాక్టరు ఆపిన డ్రైవరును సైతం పోలీసులు అనుమానిస్తున్నారు. రాజు హత్య జరిగిన కాసేపటికి.. తనను తాను లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యుడిగా పరిచయం చేసుకొన్న రోహిత్‌ గోదరా అనే వ్యక్తి ఈ ప్రతీకార హత్యకు తామే బాధ్యులమని ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన పోస్ట్‌ చేశాడు. కాసేపటి తర్వాత ఈ పోస్టు తొలగించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని