థాయ్‌లాండ్‌ విద్యార్థినిపై హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ అత్యాచారయత్నం

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆచార్యుడు కీచకుడిగా మారాడు. హిందీ నేర్పిస్తానంటూ విదేశీ విద్యార్థినిని నమ్మించి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు.

Published : 04 Dec 2022 04:42 IST

ఈనాడు, హైదరాబాద్‌; గచ్చిబౌలి, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆచార్యుడు కీచకుడిగా మారాడు. హిందీ నేర్పిస్తానంటూ విదేశీ విద్యార్థినిని నమ్మించి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. శనివారం తెల్లవారుజామున వర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... థాయ్‌లాండ్‌కు చెందిన ఓ విద్యార్థిని (24) స్టడీ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఎంఏ హిందీ కోర్సులో చేరింది. 20 రోజుల క్రితమే విశ్వవిద్యాలయానికి వచ్చింది. క్యాంపస్‌లోని ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ వసతి గృహంలో ఉంటోంది.  ప్రొఫెసర్‌ రవిరంజన్‌ (62) ఆమెకు హిందీ బోధిస్తున్నాడు. శుక్రవారం తరగతులు పూర్తయ్యాక హిందీ నేర్పిస్తానని ఆ విద్యార్థినిని సాయంత్రం 4 గంటల సమయంలో తన కారులో ఎక్కించుకున్నాడు. మజీద్‌బండలోని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు.

కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఇచ్చి..

విద్యార్థినికి పాఠాలు చెబుతూనే కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఇచ్చాడు. ఆమె దాన్ని తాగి వాంతి చేసుకొంది. ఈ క్రమంలో అనునయిస్తున్నట్టు నటిస్తూ అత్యాచారానికి యత్నించాడు. అతడి ప్రవర్తనతో ఉలిక్కిపడిన బాధితురాలు తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటించింది. థాయ్‌లాండ్‌లో తనకు తెలిసిన ప్రొఫెసర్‌కు ఫోన్‌ చేసి చెప్పింది. ఆయన రవిరంజన్‌కు ఫోన్‌ చేసి తీవ్రంగా మందలించారు. దాంతో రాత్రి 9.30 గంటల సమయంలో అతడు బాధితురాలిని హాస్టల్‌ వద్ద దించి వెళ్లిపోయాడు. విద్యార్థిని ఆందోళనగా కనిపించటం, మాట్లాడలేని పరిస్థితిలో ఉండటాన్ని గమనించిన సహచర విద్యార్థినులు ఏం జరిగిందని అడగటంతో బాధితురాలు కన్నీటిపర్యంతమైంది. బాధితురాలికి మాతృభాష మినహా ఇతర భాషలు పెద్దగా తెలియవు. ఆమె ఆవేదన, హావభావాలను చూసి ప్రొఫెసర్‌ ఏదో దుశ్చర్యకు పాల్పడ్డాడనే విషయం వారికి అర్థమైంది. వారు ఆమెను క్యాంపస్‌లోని హెల్త్‌సెంటర్‌కు తరలించారు. థాయ్‌లాండ్‌ ప్రొఫెసర్‌కు విషయం ముందే తెలియడంతో ఆయన ఫోన్‌ చేసి రవిరంజన్‌ ద్వారా జరిగిన విషయాన్ని ఆంగ్లంలో హెచ్‌సీయూ అధికారులకు వివరించారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్‌ రవిరంజన్‌పై ఐపీసీ 354, 354ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ గోనె సురేష్‌ తెలిపారు.

విద్యార్థుల ఆందోళన

రవిరంజన్‌ను సస్పెండ్‌ చేయాలంటూ పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారాలు మూసివేసి బైఠాయించారు. వర్సిటీ ఉన్నతాధికారులు ప్రొఫెసర్‌ను సస్పెండ్‌ చేశామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. రవిరంజన్‌పై గతంలోనూ లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయని ఏబీవీపీ నాయకుడు మహేష్‌ ఆరోపించారు. బిహార్‌ రాష్ట్రానికి చెందిన రవిరంజన్‌ వర్సిటీలో చాలాకాలంగా పనిచేస్తున్నాడు. ఇతడి కుమారుడు ఇదే వర్సిటీలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు