బాలిక అనుమానాస్పద మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండల పరిధిలోని ఓ తండాకు చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక(16) శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మృతి చెందడం కలకలం రేపింది.

Published : 04 Dec 2022 04:42 IST

హత్యాచారమే అంటూ తల్లిదండ్రులు, గ్రామస్థుల ఆరోపణలు
అనుమానితులపై ఆగ్రహం.. ఆస్తుల ధ్వంసం, వాహనాల దహనం
మృతదేహంతో జడ్చర్లలో రాస్తారోకో

బాలానగర్‌, జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండల పరిధిలోని ఓ తండాకు చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక(16) శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మృతి చెందడం కలకలం రేపింది. అదే తండాకు చెందిన బాబాయి వరసయ్యే యువకుడితో పాటు మరో ఇద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వారి ఇళ్లు, ఆస్తులపై దాడులకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బాలిక తల్లిదండ్రులు పని నిమిత్తం కుమారుడిని వెంట బెట్టుకుని గురువారం ఉదయం హైదరాబాద్‌ వెళ్లారు. కిరాణం, బెల్టుషాపు నడిపిస్తూ కుమార్తె ఊళ్లోనే ఉంది. శనివారం ఉదయం 6.20 గంటల ప్రాంతంలో తండ్రికి ఆ బాలిక ఫోన్‌ చేసింది. ఏడుస్తూ మాట్లాడుతూ ‘డాడీ వస్తున్నారా.. మీతో మాట్లాడాలని అనిపించింది’ అంటూ చెప్పింది. ‘ఏమైంది..? మేం ఇంటికి వస్తున్నాం.. బడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండు.. బైకుపై తీసుకెళ్తా’ అని తండ్రి చెప్పారు. ఈలోగా ఫోన్‌ కాల్‌ కట్‌ అయ్యింది. తర్వాత కొంత సమయానికి ఇంటి సమీపంలోని బంధువులు వెళ్లి చూడగా బాలిక ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆ విషయం తండ్రికి తెలియజేశారు. మృతదేహం ఉన్నచోట మద్యం సీసాలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న జడ్చర్ల గ్రామీణ సీఐ జములప్ప ఘటనా స్థలానికి చేరుకుని బాలిక తల్లిదండ్రులు, గ్రామస్థులతో మాట్లాడారు.

అటు విచారణ.. ఇటు దహనకాండ

పోలీసులు ఓ వైపు విచారణ చేస్తుండగానే.. రెండు గ్రామాల్లో ముగ్గురు అనుమానితుల ఇళ్లపై గ్రామస్థులు దాడి చేశారు. వారి ఫొటో స్టూడియో, దుకాణాలను ధ్వంసం చేశారు. కారు, ద్విచక్రవాహనాలను తగలబెట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు. మృతురాలి సోదరి మాట్లాడుతూ.. వరుసకు బాబాయి అయ్యే నిందితుడు గతంలో తనపైనా అత్యాచారయత్నం చేశాడని, అది చెల్లికి చెప్పి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించానని తెలిపింది. పోలీసులు శవపరీక్ష కోసం మృతదేహాన్ని జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. అనుమానితులు ముగ్గురూ పరారీలో ఉన్నారు. వారిని అరెస్టు చేసేవరకు పోస్టుమార్టం చేయనివ్వబోమని బంధువులు, గిరిజన సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చి జడ్చర్ల నేతాజీ చౌక్‌లో రాస్తారోకో చేపట్టారు. దోషులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెంకటేశ్వర్లు హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జడ్చర్ల ఎమ్మెల్యే డా.లక్ష్మారెడ్డి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రాత్రి యువకులు బాలిక ఇంటికి రావటం చూశామని సమీపంలోని కొందరు తెలిపారు. అనుమానితులుగా చెబుతున్న ఇద్దరు యువకులు పక్క గ్రామం చిన్నరేవల్లికి చెందిన ఓ యువకుడిని కొట్టినట్లు కూడా వినవస్తోంది. ముగ్గురు యువకుల వల్లనే తన కుమార్తె చనిపోయిందనే తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లుని సంప్రదించగా పోస్టుమార్టం చేయలేదని, నివేదిక వస్తే తప్ప ఏం జరిగిందో స్పష్టంగా చెప్పలేమని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని