వార్డెన్‌ నిర్వాకానికి నిండు ప్రాణం బలి

వార్డెన్‌ నిర్వాకానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. కరీంనగర్‌ జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామానికి చెందిన శ్రీనివాస్‌, రాధ దంపతులకు కుమారుడు మారం శ్రీకర్‌ పాఠశాల ఆవరణలోని బావిలో జారిపడి గల్లంతయ్యాడు. 

Updated : 05 Dec 2022 06:09 IST

చెత్త తీయాలంటూ ఆరుగురు విద్యార్థులను బావిలో దింపిన వైనం
ప్రమాదవశాత్తు లోపలికి జారిపడి ఓ విద్యార్థి మృతి

తిమ్మాపూర్‌, న్యూస్‌టుడే: వార్డెన్‌ నిర్వాకానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. విద్యార్థులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామానికి చెందిన శ్రీనివాస్‌, రాధ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్‌ హైదరాబాద్‌లో డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వహిస్తూ అక్కడే భార్య, కుమార్తెతో ఉంటున్నారు. కుమారుడు మారం శ్రీకర్‌ (13) తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీలో అమ్మమ్మ వద్ద ఉండి ఓ ప్రైవేటు పాఠశాలలోని హాస్టల్‌లో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం పాఠశాల ఆవరణలోని బావిలో చెత్త తొలగించాలంటూ శ్రీకర్‌తో పాటు అయిదుగురు విద్యార్థులను వార్డెన్‌ బావిలో దింపాడు. అనంతరం మిగిలిన విద్యార్థులు బయటకు రాగా శ్రీకర్‌ బావిలో జారిపడి గల్లంతయ్యాడు. తోటి విద్యార్థులు అరవగా వార్డెన్‌ ఘటన స్థలం నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది గంట పాటు శ్రమించి శ్రీకర్‌ మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం వద్ద శ్రీకర్‌ కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. విద్యార్థి సంఘాలు పాఠశాల వద్ద బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశాయి. ఘటనపై ఫిర్యాదు అందాల్సి ఉందని, స్కూల్‌ యాజమాన్యం అందుబాటులో లేదని ఎస్సై ప్రమోద్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని